Site icon NTV Telugu

Meta: అమెరికా ప్రభుత్వానికి మెటా హెచ్చరిక.. ఆ చట్టం అమల్లోకి వస్తే..

Meta Warns Us Govt

Meta Warns Us Govt

Meta Warns To Remove News From Facebook if US Passes Media Bill: మెటా సంస్థ మంగళవారం ఒక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం ‘జర్నలిజం బిల్లు’కి ఆమోదం తెలిపితే.. తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్)లో మీడియా సంస్థల వార్తల్ని బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే.. ఫేస్‌బుక్‌లో షేర్ చేసే కంటెంట్‌కి గాను అమెరికా మీడియా సంస్థలకు బలంగా ఫీజు బేరమాడే అవకాశం లభిస్తుంది. అంటే.. ఫేస్‌బుక్ గనుక తమ న్యూస్ షేర్ చేస్తే, అందుకు అక్కడి మీడియా సంస్థలకు డబ్బులు డిమాండ్ చేసే ఆస్కారం ఉంటుంది. అందుకే, ఈ బిల్లుని అమల్లోకి తీసుకురావొద్దని మెటా సంస్థ అమెరికా ప్రభుత్వానికే హెచ్చరిక చేసింది. అంతేకాదు.. ఫేస్‌బుక్‌లో కంటెంట్ షేర్ చేయడం ద్వారా మీడియా సంస్థలకు తమ మాధ్యమం ద్వారా ట్రాఫిక్ పెంచుతున్నామని కూడా పేర్కొంది.

గతంలో ఇలాంటి చట్టాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో.. అప్పట్లో ఫేస్‌బుక్ కొన్నాళ్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థల వార్తలను సస్పెండ్‌ చేసింది. తాజాగా ఇటువంటి చట్టాన్నే అమెరికాలో పరిశీలిస్తున్నారు. దీనిని జేసీపీఏ పేరిట మిన్నెసోటా సెనెటర్‌ యామీ క్లోబౌషెర్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకి అన్ని విభాగాల నుంచి మద్దతు లభించింది కాబట్టి, ఇది అమల్లోకి వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అప్పుడు.. ఈ చట్టం ద్వార వార్తా సంస్థలు తమ కంటెంట్ ఫీజు విషయంలో సోషల్‌ మీడియా సంస్థల నుంచి సమిష్టిగా డిమాండ్ చేయొచ్చు. యాడ్స్ ద్వారా సోషల్ మీడియా సంస్థలకు వచ్చే ఆదాయంలో నుంచి వార్తా సంస్థలు భారీ వాటా కోరవచ్చు. తమ వార్తలను వినియోగించి ఫేస్‌బుక్ భారీ ఎత్తున ఆదాయం పొందుతోందని.. కొవిడ్ సమయంలోనూ వార్తా సంస్థలన్నీ నానా ఇబ్బందులు పడితే, మెటా మాత్రం భారీగా ఆర్జించిందని వార్తా సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే.. మెటా వాదనలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. వార్తలను తాము షేర్ చేయడం వల్లే, వీక్షకుల సంఖ్య వార్తా సంస్థలకు గణనీయంగా పెరిగిందని చెప్తోంది. మెటా ప్రతినిధి ఆండీ స్టోన్‌ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ జర్నలిజం బిల్లును కాంగ్రెస్‌ ఆమోదిస్తే, మా వేదికపై నుంచి అమెరికాకు సంబంధించిన వార్తలను తొలగించాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. అంతేకాదు.. ఫేస్‌బుక్ షేర్ చేసే వార్తల నుంచి తమకు లభించే ఆదాయం చాలా తక్కువ అని తెలిపారు. మరోవైపు.. అమెరికాలో మెటా లాంటి పెద్ద టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తుందని, వాటిని కట్టడి చేయాల్ని అక్కడి ప్రభుత్వం కొన్ని చట్టాల్ని అమల్లోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఈ జర్నలిజం బిల్లు. అమెరికన్‌ ఎకనామిక్‌ లిబర్టీస్‌ ప్రాజెక్టు పరిశోధకుడు మాట్‌ స్టోలర్‌.. మీడియా సంస్థల్ని మెటా సజీవంగా తింటోందని వ్యాఖ్యానించారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version