NTV Telugu Site icon

India-China: చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం.. టిబెల్‌లోని 30 ప్రదేశాలకు పేర్లు మార్చనున్న భారత్..

India China

India China

India-China: డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ గట్టి సమాధానం ఇస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని పదేపదే భావించే చైనా, ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడం పరిపాటిగా మారింది. అయితే, దెబ్బకుదెబ్బగా భారత్ కూడా టిబెట్‌లోని 30 ప్రాంతాలకు పేర్లు మార్చాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేబినెట్ టిబెట్ ప్రాంతంలోని 30 ప్రాంతాలకు పేరు మార్చాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే భారత్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ పెట్టాలనుకుంటున్న ఈ పేర్లు చారిత్రక పరిశోధన, టిబెట్ ప్రాంతానికి సంబంధించిన సంబంధాల ఆధారంగా భారత సైన్యం ద్వారా ప్రచురించబడుతుంది. వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంట వారి మ్యాప్‌లలో అప్డేట్ చేస్తారు. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని మొత్తం 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గము ఈ జాబితాలో ఉన్నాయి. చైనా గతంలో 2017 నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఆ సమయంలో భారత్ తమ తీవ్ర నిరసన తెలిపింది. అరుణాచల్ భారత్‌లో అవిభాజ్యం భాగమని చెప్పింది.

Read Also: UGC: యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు..యూజీసీ సంచలన నిర్ణయం..

టిబెట్ ప్రాంతాన్ని చైనా బలవంతంగా ఆక్రమించిన తర్వాత, భారత్ ఈ భూభాగాన్ని చైనాలో అంతర్భాగంగా అంగీకరించింది. అయితే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం చైనా పేర్లు మార్చే విధానంలో దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 5, 2020లో పాంగాంగ్‌త్సో సరస్సు, గాల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరు పక్షాలు ఈ సైనిక ప్రతిష్టంభనను తగ్గించేందుకు 21 సార్లు చర్చించాయి. భారత్ టిబెట్‌లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలను క్లెయిమ్ చేసే లక్ష్యాన్ని నొక్కిచెప్పనుంది.

ఇటు భారత్ సరిహద్దుల్లో, అటు దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. దీని ద్వారా చైనాకు గట్టి సందేశం ఇవ్వాలని భావిస్తోంది. జూన్ 11న విదేశాంగ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఎస్ జైశంకర్ చైనా మరియు పాకిస్థాన్‌లకు సంబంధించిన సమస్యలపై భారతదేశం యొక్క బలమైన వైఖరిని పునరుద్ఘాటించారు. సరిహద్దు సమస్యలు, సీమాంతర ఉగ్రవాదం రెండింటినీ భారత్ దృఢంగా పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Show comments