NTV Telugu Site icon

Surprise Gift: యువకుడి సాహసం.. గిఫ్ట్‌గా రూ.60 లక్షల విలువైన కారు..

Surprise Gift

Surprise Gift

కొన్ని సందర్భాల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే.. మానసిక సంతృప్తియే కాదు.. ఆ కుటుంబం నుంచి కృతజ్ఞతలు కూడా అందుకుంటాం.. మరికొన్ని సందర్భాల్లో ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా పొందే వీలు కూడా ఉంటుంది.. తాజాగా, ఓ యువకుడు ప్రాణాలకు తెగించి.. మరో వ్యక్తి ప్రాణం కాపాడాడు.. లక్షల విలువైన కారును బహుమతిగా అందుకుని ఔరా..! అనిపించాడు. చికాగోలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: CM KCR: ప్రగతి భవన్ లో కీలక సమావేశం.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ

చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ అనే యువకుడు తన రిస్క్‌ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. ఇద్దరి యువకుల మధ్య గొడవ జరగగా.. ఆ ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్‌ రైల్వే ట్రాక్స్‌ పై పడిపోయారు. అయితే, దాడి చేసిన వ్యక్తి తప్పించుకోగా.. బాధితుడు మాత్రం ఎలక్ట్రిక్‌ ట్రాక్స్‌ మీద పడిపోవడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.. 600 వోల్ట్స్‌ పవర్‌తో అల్లాడిపోయాడు.. ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్నవాళ్లంతా భయంతో దూరంగా పరుగులు తీయగా.. టోనీ మాత్రం సాహసం చేసి రైల్వే పట్టాల మీదకు దూకాడు.. వద్దని కొందరు వారిస్తున్నా.. తన ప్రాణాలు లెక్కచేయకుండా మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు పూనుకున్నాడు.. జాగ్రత్తగా ఆ వ్యక్తి పక్కకు జరిపాడు.. ఇక, టోనీ చేసిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేశాయి.. నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.. అంతేకాదు.. స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇదే సమయంలో.. ఊహించని గిఫ్ట్‌ అందుకున్నాడు టోనీ.. స్థానికంగా ఉండే ఓ బిజినెస్‌ మెన్‌.. ఆడి ఏ8 కారును టోనీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ధర ఇండియన్‌ కరెన్సీలో రూ.60 లక్షలకు పైగానే ఉండడం విశేషం.

మీలాంటి వ్యక్తులు మాకు అవసరం.. మా ప్రశంసలను అక్షరాలా చూపించాలనుకుంటున్నాము. మాకు ప్రపంచంలో ఎక్కువ మంది టోనీలు కావాలి అంటూ ఈ సందర్భంగా ఆడి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ఐయామ్ టెల్లింగ్ డోంట్ షూట్ స్థాపకుడు ఎర్లీ వాకర్ తెలిపారు. ఇక, ఆనందాన్ని వ్యక్తం చేసిన టోనీ.. ఆ కారు తన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని చెప్పాడు. బాధితుడిని కాపాడే సమయంలో కొద్దిగా షాక్‌ తగిలిందని.. అయినా లెక్కచేయకుండా కాపాడినట్టు వెల్లడించాడు.. మరోవైపు.. పార్క్ మనోర్ సౌత్ సైడ్ పరిసరాల్లోని తన ఇంటి నుండి సబర్బన్ ఓక్ లాన్‌లోని అమెజాన్ ఫ్రెష్‌తో తన ఉద్యోగానికి వెళ్లడానికి రెండు బస్సులు మరియు రైలును మారుతుంటాడు.. ఇప్పుడు కారులోనే ఉద్యోగానికి వెళ్లే అవకాశం దక్కింది. మొత్తంగా అతడి ధైర్యమే.. అతడికి విలువైన కారును బహుమతిగా అందించింది.