Site icon NTV Telugu

MH370 Mystery: ఇప్పటికైనా MH370 మిస్టరీ వీడుతుందా.? దశాబ్ధం క్రితం 239 మందితో విమానం అదృశ్యం..

Mh370 Missing

Mh370 Missing

MH370 Mystery: మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన MH370 మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విమానం అదృశ్యమై 11 ఏళ్లు అవుతున్నా, అసలు ఈ విమానానికి ఏమైంది, ఎక్కడ కూలిపోయింది అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. విమానానికి సంబంధించిన శకలాలు, ప్రయాణికుల మృతదేహాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అయితే, మరోసారి ఈ విమానం కోసం అన్వేషణ తిరిగి ప్రారంభిస్తామని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అనేక సార్లు విమానాన్ని కనుగొనడంలో తమ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, మరోసారి అణ్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది.

మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ప్రయాణమైన బోయింగ్ 777 విమానం అనూహ్యంగా అదృశ్యమైంది. విమానం అకస్మాత్తుగా రాడార్ నుంచి తప్పిపోయింది. ఇది విమానయాన చరిత్రలోనే రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.

బుధవారం, మలేషియా రవాణా మంత్రిత్వ శాఖ MH370 కోసం శోధన కార్యకలాపాలు డిసెంబర్ 30న తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. అమెరికాకు చెందిన సముద్ర అన్వేషన్ సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఈ విమానం కుప్పకూలినట్లు భావిస్తున్న ప్రాంతాల్లో శోధిస్తుందని మలేషియా ప్రభుత్వం చెబుతోంది. బాధితులకు కుటుంబాలు తమ వారికి ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు, ఇందు కోసమే మళ్లీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు మలేషియా తెలిపింది.

11 ఏళ్లుగా రహస్యం:

విమానం అదృశ్యమైన ఒక రోజు తర్వాత, మార్చి 9, 2014న మొదటి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. మలేషియా రాయల్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ.. సైనిక రాడార్ డేటా అధ్యయనం తర్వాత విమానం అండమాన్ సముద్రం మీదుగా తిరిగి వెళ్లి ఉండొచ్చని చెప్పారు. ఒక ఏడాదికి పైగా ఎలాంటి శిథిలాలు కనిపించలేదు. జూలై 2015లో, విమానానికి చెందిన కుడి రెక్క నుంచి ఒక ఫ్లాపెరాన్ హిందూ మహాసముద్రంలోని రియూనియన్ ద్వీపంలోకి కొట్టుకు వచ్చింది. దీని తర్వాత దెబ్బతిన్న సూట్ కేస్, చైనీస్ వాటర్ బాటిల్, ఇతర వస్తువులు ఆస్ట్రేలియా సమీపంలో గుర్తించారు. కానీ అవి విమానంలోని ప్రయాణికుల నుంచి వచ్చాయో లేదో అధికారులు నిర్ధారించలేకపోయారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో చైనా, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం, UK, US వంటి దేశాల నుండి ఓడలు, విమానాలు పాల్గొన్నాయి. ఇన్ని ప్రయత్నాలు చేసిన విమానానికి చెందిన ప్రధాన భాగాల్ని కనుగొనలేకపోయారు.

లాస్ మెసేజ్ ‘‘గుడ్ నైట్’’:

కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాల తర్వాత విమానం నుంచి చివరిసారిగా ట్రాన్స్‌మిషన్ జరిగింది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా “గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో”తో సైన్ ఆఫ్ చేసాడు. అదే సమయంలో విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొంత సమయం తర్వాత దాని ట్రాన్‌పాండర్ ఆఫ్ చేయబడింది. దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు. మిలిటరీ రాడార్ ప్రకారం.. విమానం తన మార్గం నుంచి తప్పినట్లు తెలుస్తోంది. మలేషియా, పెనాంగ్ ద్వీపం మీదుగా ఇండోనేషియా సుమత్రా ద్వీపం కొనలో ఉన్న అండమాన్ సముద్రంలోకి వెళ్లినట్లు చూపించింది. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి అన్ని సంబంధాలను కోల్పోయింది.

మలేషియా, ఆస్ట్రేలియా, చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోని 120,000 చదరపు కి.మీ (46,332 చదరపు మైళ్ళు) ప్రాంతంలో ఇన్‌మార్‌శాట్ ఉపగ్రహం, విమానం మధ్య ఆటోమేటిక్ కనెక్షన్ డేటా ఆధారంగా నీటి అడుగున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపుగా 143 మిలియన్ డాలర్లను విమాన శోధన కోసం ఖర్చు చేశారు. విమానం జాడ తెలియకపోవడంతో జనవరి 2017లో సెర్చింగ్ నిలిపేశారు.

Exit mobile version