Fuel Gases: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా మన దేశంలో వంటగ్యాస్ (LPG) భయాలు మొదలయ్యాయి. అవసరం లేకున్నా ప్రజలు సిలిండర్లను బుక్ చేయడం పెరిగింది. మరోవైపు కేంద్రం ఎల్పీజీ ఉత్పత్తిని 30 శాతం మేర పెంచింది. దేశంలో అసలు గ్యాస్, చమురు కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రజలు పానిక్ అవుతున్నారు.
అయితే.. LPG, CNG, PNG, LNG అన్ని వాయువలే కదా, వీటి మధ్య తేడాలు ఏంటి, ఎక్కడ అవసరం అవుతాయనే ప్రాథమిక అనుమానం అందరికి వస్తుంది. ఇప్పుడు వీటి మధ్య తేడాలు చూద్ధాం. ఈ వాయువుల్ని వేర్వేరు పద్ధతుల్లో ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం జరుగుతుంది. ప్రాంతం, భద్రతా అవసరాలు, సౌలభ్యం వంటి అంశాల ఆధారంగా వివిధ రంగాల్లో వీటి వినియోగం ఉంటుంది.
LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్):
మనం వంటిళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లలో LPG ఉంటుంది. ఇది ద్రవరూపంలో సిలిండర్లలో నిల్వ చేయబడుతుంది. దీంట్లో ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ వాయువులు ఉంటాయి. ఇది ముడి చమురు శుద్ధి చేసే సమయంలో దీనిని తయారు చేస్తారు. దీనిని లిక్విడ్ రూపంలో సిలిండర్లలో నింపుతారు. మనం సాధారణంగా చూసే ఎరుపు, నీలం కలర్ సిలిండర్లలో ఈ వాయువే ఉంటుంది.
ఇది గాలి కన్నా బరువుగా ఉంటుంది. ఒక వేళ లీక్ అయితే ఉపరితలంపై విస్తరిస్తుంది. దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మండే స్వభావం ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీని వాహనాలకు ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. మన దేశం ఇలా వాడటం తక్కువ.
CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్):
CNG అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఇది ప్రధానంగా మీథేన్ (CH4) వాయువును కలిగి ఉంటుంది. సహజవాయువుల్లో దీని ఎక్కువ భాగం దీనిదే. ఈ వాయువును అధిక పీడనం(200–250 బార్) వద్ద సిలిండర్లలో నింపుతారు. ఎల్పీజీ లాగా ఇది ద్రవరూపంలో ఉండదు. వాయురూపంలో ఉంటుంది. CNG ప్రధానంగా ఆటో-రిక్షాలు, టాక్సీలు, బస్సులు మరియు కార్లు వంటి వాహనాలలో ఉపయోగిస్తారు. ఇది పెట్రోల్, డీజిల్ కన్నా చౌకైనది. తక్కువ పొగను విడుదల చేస్తుంది.
PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్): పైప్‌లైన్‌ల ద్వారా ఇళ్లకు అందించబడే క్లీన్ గ్యాస్
PNG అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్. ఇది కూడా ప్రధానంగా మీథేన్ వాయువును కలిగి ఉంటుంది. ఇది CNG లాంటిదే. కానీ తక్కువ పీడనంతో పైప్‌లైన్ ద్వారా ఇళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలకు సరఫరా చేయబడుతుంది. వీటికి మీటర్లు అమర్చుతారు. మనం వాడుకున్న గ్యాస్‌కు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. PNG గాలి కంటే తేలికైనది, దీని వల్ల లీక్ సంభవించినట్లయితే, అది పైకి వెదజల్లుతుంది. ప్రమాదం తక్కువగా ఉంటుంది. PNG, CNG మధ్య ప్రాథమిక వ్యత్యాసం వాటి నిల్వ మరియు డెలివరీ పద్ధతులే.
LNG (ద్రవీకృత సహజ వాయువు):
LNG అంటే ద్రవీకృత సహజ వాయువు. ఇది కూడా ఒక రకమైన మీథేన్ వాయువు, కానీ దానిని చాలా తక్కువ ఉష్ణోగ్రతకు (-162 డిగ్రీల సెల్సియస్) చల్లబరచడం ద్వారా ద్రవ స్థితికి మార్చబడుతుంది. ఈ ప్రక్రియ దీని పరిమాణాన్ని 600 రెట్లు తగ్గిస్తుంది. దీంతో పెద్ద ఓడల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రవాణ చేయడానికి వీలు అవుతుంది.
ఓడరేవులకు చేరుకున్న తర్వాత దీనిని వాయు స్థితిలోకి మారుస్తారు. ఆ తర్వాత పైప్ లైన్స్, ట్రక్కుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలకు తరలిస్తారు. భారీ ట్రక్కుల్లో దీనిని ఇంధనంగా వాడుతారు.
