Los Angeles Earthquake: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం లాస్ ఏంజెలెస్ ప్రాంతాన్ని వణికించింది. భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు (Aftershocks) నమోదయ్యాయి. ఈ ఘటనతో లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో భూకంపం రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు విమానాశ్రయంలోని లైవ్‌స్ట్రీమ్ వీడియోలో రికార్డయ్యాయి.
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1972 లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది. విమానం రన్‌వే వైపు వస్తున్న సమయంలో భూమి కంపించడం ప్రారంభమైంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పైలట్లకు ల్యాండింగ్ నిలిపివేసి గాల్లోనే ఉండాలని సూచించారు. “Delta 1972, go around. We’re having a big earthquake” అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్లకు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం రన్‌వే వైపు వెళ్లకుండా పైకి ఎగిరి మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కెమెరా ఒక్కసారిగా కంపించడం, నేపథ్యంలో కార్ల అలారాలు మోగడం వినిపించాయి. విమాన ట్రాకింగ్ సంస్థ FlightAware సమాచారం ప్రకారం.. ఈ విమానం సుమారు గంటా 13 నిమిషాలు ఆలస్యమైంది.
40కి పైగా ఆఫ్టర్‌షాక్‌లు
అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ USGS ప్రకారం.. శనివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 9.30 గంటలకు దక్షిణ కాలిఫోర్నియాలోని మాన్హాటన్ బీచ్ సమీపంలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. మాన్హాటన్ బీచ్‌కు పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 3.7 మైళ్ల దూరంలో, భూమికి 7.6 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ప్రధాన భూకంపం తర్వాత 40కి పైగా ఆఫ్టర్‌షాక్‌లు నమోదైనట్లు CNN, USGS గణాంకాలను ఉటంకిస్తూ నివేదించింది. వీటిలో కొన్ని ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అంతేకాకుండా, 4.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో మరో ప్రకంపన సంభవించే అవకాశం 30 శాతంగా USGS అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది.
పదేళ్ల తర్వాత ఇంతటి తీవ్రతతో భూకంపం
లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో భూకంపాలు సాధారణమే అయినప్పటికీ, ఈసారి వచ్చిన ప్రకంపనల తీవ్రత స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది. CNN నివేదిక ప్రకారం.. 2014లో ఆరెంజ్ కౌంటీలో సంభవించిన 5.1 తీవ్రత భూకంపం తర్వాత ఈ ప్రాంతంలో నమోదైన అత్యంత బలమైన భూకంపం ఇదేనని USGS గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే 2014లో వచ్చిన భూకంపంతో పోలిస్తే తాజా భూకంపం భూమికి మరింత లోతులో సంభవించినట్లు నిపుణులు పేర్కొన్నారు.
❗️ California ROCKED by 5.2M EARTHQUAKE near Manhattan Beach — ‘SEVERE’ ALERTS SENT OUT
AIRPORT CAMERA VIOLENTLY SHAKES as DRIVERS HONK
PILOTS WARNED by AIR TRAFFIC CONTROL of a ‘PRETTY BIG EARTHQUAKE’ https://t.co/xV1g0r1Bn5
— RT (@RT_com) November 28, 2026

