Kuwait: మిడిల్ ఈస్ట్‌లో అత్యంత ధనిక దేశంగా, చమురు సంపన్నమైన కువైట్ పాలకుడు, ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా మరణించినట్లు రాయల్ కోర్ట్ తెలిపింది. మూడేళ్లుగా అధికారంలో ఉన్న 86 ఏళ్ల షేక్ నవాఫ్ మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలుపుతున్నట్లు కువైట్ ప్రభుత్వ టెలివిజన్ ఒక ప్రకటనలో పేర్కోంది. గత నవంబర్ నెలలో షేక్ నవాఫ్ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు.
ప్రస్తుతం రాజు చనిపోవడంతో, క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్న షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-సభా కువైట్‌కి రాజు అయ్యారు. ఈ విషయాన్ని కువైట్ స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. ప్రస్తుతం ఇతడికి 83 ఏళ్లు. కువైట్ దేశంలో అధికారం అల్ సబా కుటుంబం చేతిలోనే ఉంటుంది.
Read Also: Rahul Gandhi: నిరుద్యోగం, ద్రవ్యోల్భణం.. మోడీ విధానాల కారణంగానే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన..
1937లో జన్మించిన షేక్ నవాఫ్ 1921 నుండి 1950 వరకు కువైట్ రాజుగా ఉన్న షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్‌కి 5వ కుమారుడు. తన 25 ఏటనే ఆయన హవల్లీ ప్రావిన్స్ గవర్నర్‌గా విధులు నిర్వహించారు. 1978 వరకు ఓ దశాబ్ధం పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.
షేక్ నవాఫ్, 2006లో అతని సవతి సోదరుడు షేక్ సబా అల్-అహ్మద్ అల్-సబా చేత యువరాజుగా ఎంపికయ్యారు. 2020లో షేక్ సభా 91 ఏళ్ల వయసులో మరణించడంతో, షేక్ నవాఫ్ కువైట్ ఎమిర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020లో చమురు ధరల పతనం కారణంగా కువైట్‌లో ఏర్పడిన సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను నడిపించాల్సి వచ్చింది.