North Korea Cyber Army: చేతుల్లో తుపాకులు పట్టుకోరు.. యుద్ధ ట్యాంకులు నడపరు. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని ప్రపంచ దేశాల బ్యాంకులు, సంస్థలను వణికిస్తున్నారు. వారే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రహస్యంగా తయారు చేసిన ‘సైబర్ సైన్యం’. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ప్లాట్‌ఫామ్ ‘బైనాన్స్’పై పడి ఏకంగా 6 బిలియన్ డాలర్లు (దాదాపు 50 వేల కోట్ల రూపాయలు) కొట్టేయడంతో ఈ ముఠా ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి స్పష్టమైంది. అసలు అగ్రరాజ్యాలనే ముప్పుతిప్పలు పెడుతున్న ఈ హ్యాకర్లు ఎలా పుట్టుకొచ్చారు? వీరి వెనుక ఉన్న కథేంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్నప్పుడే పిల్లల ఎంపిక.. ప్రత్యేక కాలేజీ
ఈ హ్యాకర్లు ఒక్కరోజులో తయారైన వాళ్లు కాదు. దీనికోసం కిమ్ సర్కార్ ఏళ్ల తరబడి పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన మాజీ హ్యాకర్ ట్రైనర్ హ్యుంగ్-క్వాంగ్ చెప్పిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా చదువులో అందరికంటే చురుగ్గా ఉండే 200 మంది తెలివైన పిల్లలను ఏటా ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. వీరిని వేరే ఏ స్కూళ్లకు పంపకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పిస్తారు.
చిన్నప్పటి నుంచే వీరికి కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్ వంటి విద్యను నూరిపోస్తారు.
ఆర్మీ జవాన్లలా కఠినమైన శిక్షణ
ఈ కాలేజీలో ఉండే పిల్లల పరిస్థితి సాధారణ విద్యార్థుల్లా అస్సలు ఉండదు. సైనికులు పాటించే కఠినమైన రూల్స్, మిలిటరీ స్థాయి శిక్షణ వీళ్లకి ఉంటాయి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. ముందుగా వీరికి ఆన్లైన్ పేకాట, గ్యాంబ్లింగ్ సైట్లను ఎలా హ్యాక్ చేయాలో నేర్పుతారు. అందులో రాటుదేలిన తర్వాతే విదేశీ బ్యాంకులు, ప్రభుత్వ నెట్‌వర్క్‌లు, క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లను ఎలా దోచుకోవాలో కఠినమైన టార్గెట్లు ఇస్తారు. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం ఈ సైబర్ సైన్యంలో సుమారు 8,000 మంది పనిచేస్తున్నారు. 2024లో వీరి సంఖ్య దాదాపు 6,000 వరకు ఉండగా, చాలా తక్కువ కాలంలోనే ఈ నెట్‌వర్క్‌ను కిమ్ భారీగా పెంచేశారని చెబుతున్నారు. వీరి వివరాలు, పేర్లు అత్యంత రహస్యంగా ఉంచుతారు. గతంలో అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోని కీలక సంస్థలను కూడా వీరు దెబ్బకొట్టారు.
పెద్ద మొత్తంలో దోపిడీ చేస్తే లగ్జరీ ఇళ్లు గిఫ్ట్!
తాజాగా బైనాన్స్ క్రిప్టో నుంచి రూ.50 వేల కోట్లు కొట్టేయడాన్ని ఉత్తర కొరియా తమ ఘన విజయంగా భావిస్తోంది. స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ ఈ హ్యాకింగ్ టీమ్‌తో మాట్లాడి మెచ్చుకోవడమే కాకుండా.. రాజధాని ప్యాంగ్యాంగ్లో వారికి విలాసవంతమైన ఇళ్లను నజరానాగా ఇచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ ఆంక్షలతో దేశానికి పైసలు రాక ఇబ్బంది పడుతున్న సమయంలో.. అణ్వాయుధాలు, క్షిపణి ప్రయోగాల ఖర్చుల కోసం కిమ్ ఇలా సైబర్ దోపిడీలను ప్రధాన ఆదాయంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సరిహద్దుల్లో మోహరించే సైనికుల కంటే, స్క్రీన్ల వెనుక దాగి ఉండే ఈ సైబర్ దొంగలే ప్రపంచానికి పెను సవాలుగా మారారు.

