NTV Telugu Site icon

Kilonova Space Explosion: అంతరిక్షంలో కిలోనోవా పేలుడు భూమిని అంతం చేస్తుందా..? సైంటిస్టులు ఏమంటున్నారు..?

Kilonova Space Explosion

Kilonova Space Explosion

Kilonova Space Explosion: బ్రహ్మాండమైన విశ్వంలో శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది కేవలం ఒక్క శాతం కూడా ఉండకపోవచ్చు. అనేక వింతలు, విశేషాలకు ఈ విశ్వం కేంద్రంగా ఉంది. అయితే మనకు తెలిసింత వరకు ఇప్పటివరకు ఒక్క భూమిపైనే జీవం ఉంది. అయితే అనంత విశ్వంలో మనలాంటి జీవులు, మనలాంటి భూములు కొన్ని కోట్లలో ఉండొచ్చు, కానీ మనం చూడలేం.

అయితే ఈ భూమి అంతానికి ఈ విశ్వమే కారణమవుతుందా..? అనేది ప్రశ్న. అయితే ఇటీవల అధ్యయనంలో అమెరికా శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ‘కిలోనోవా’ అనే అంతరిక్ష సంఘటన భూమిని అంతం చేసే అవకాశం ఉందని, అయితే ఇలాంటి పేలుడు ఎంత దూరంలో జరగాలనేదానిపై అధ్యయనం చేశారు. విశ్వంలోని శక్తివంతమైన పేలుళ్లలో కిలోనోవా ఒకటి. ఈ సంఘటనలో వెలువడే గామా కిరణాలు, కాస్మిక్ కిరణాలు, ఎక్స్-కిరణాలు ప్రాణాంతకమైన రేడియేషన్ విడుదల చేస్తాయని, దీని వల్ల భూమిపై ఉన్న జీవరాశి తుడిచిపెట్టుకుపోతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

కిలోనోవా అనే దృగ్విషయం రెండు న్యూట్రాన్ స్టార్స్ ఢీకొట్టిన సందర్భంలో లేకపోతే న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్‌లో కలిసిపోతున్న సమయంలో జరుగుతుంది. అయితే ఇలాంటి ఘటనల్లో భూమి నాశనం కావాలంటే ఆ సంఘటన భూమికి 36 కాంతి సంవత్సరాల లోపు దూరంలో జరగాలని ఇల్లినాయిస్ అర్బానా ఛాంపెయిన్ యూనివర్సిటీ టీమ్ లీడర్, శాస్త్రవేత్త హైల్ పెర్కిన్స్ చెప్పారు. కాంతి సంవత్సరం అంటే ఒక ఏడాదిలో కాంతి ప్రయాణించే దూరం. ఒక సెకన్‌కి కాంతి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Read Also: World Cup 2023: ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్ ఓపెనర్ అరుదైన రికార్డ్

అత్యధిక సాంద్రత కలిగిన న్యూట్రాన్ నక్షత్రాలు శక్తివంతమైన పేలుడు తర్వాత దాని నుంచి పుట్టే శక్తివంతమైన కణాలు ఓజోన్ పొరను నాశనం చేస్తాయని, ఆ తరువాత 1000 ఏళ్ల పాటు అతినీలలోహిత కిరణాల ధాటికి భూమి గురవుతుంది. న్యూట్రాన్ స్టార్ పేలుడు కాస్మిక్ బబుల్‌ని ఏర్పరుస్తుంది, దాని మార్గంలో ఉన్న అన్నింటిని ప్రభావం చూపిస్తుంది.

గామా కిరణాలు కూడా చాలా ప్రమాదకరంగా మారుతాయని, చుట్టుపక్కల ఉన్న స్టార్ డస్ట్ లేదా ఇంటర్‌స్టెల్లార్ మీడియంతో గామా కిరణాల తాకిడి ఎక్స్-కిరణాల ఉద్గారాలకు దారి తీయవచ్చు. ఇది భూమి ఓజోన్ పొరను అయనీకరిస్తుంది. ఈ పరిణామం మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. ఇలాంటి సంఘటనల్ని అనుభవించాలంటే కిలోనోవా పేలుడు భూమి నుంచి 16 కాంతి సంవత్సరాల దూరంలో జరగాలని శాస్త్రవేత్తలు చెప్పారు.

అయితే భూమికి ప్రస్తుత ప్రమాదం ఏం లేదని, ఇలాంటి అంతరిక్ష సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని సైంటిస్టులు తెలిపారు. 130 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని న్యూట్రాన్ స్టార్ విలీనాన్ని అధ్యయనం చేసింది. ఈ సంఘటనలో భూమి ద్రవ్యరాశితో పోలిస్తే 1300 రెట్లు ఎక్కువ పార్టికల్స్ రిలీజ్ అయ్యాయి. భారీ ఎలా ఏర్పడుతాయనే దానికి కిలోనోవా ఆధారాలు ఇవ్వగలదని పరిశోధకులు భావిస్తున్నారు.