Site icon NTV Telugu

Russia – Ukraine War: ఉక్రెయిన్ కోసం రంగంలోకి అమెరికా.. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అందిస్తామని హామీ

Joe Biden Air Defence

Joe Biden Air Defence

Joe Biden Promises Zelensky Advanced Air Defense Systems After Russian Strikes: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు రష్యా దిగడంతో.. ఉక్రెయిన్ కోసం అమెరికా మరోసారి రంగంలోకి దిగింది. రష్యా మిసైల్స్‌ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అందిస్తామని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు. రష్యా క్షిపణి దాడుల క్రమంలో జెలెన్‌స్కీతో ఫోన్ ద్వారా మాట్లాడిన బైడైన్.. ఆ మేరకు హామీ ఇచ్చారు. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను కూడా అందిస్తామన్నారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు. బైడెన్‌తో మాట్లాడిన అనంతరం.. రక్షణ సహకారంలో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌కు మా తొలి ప్రాధాన్యమని జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు.

రష్యా క్షిపణి దాడుల్ని ఖండించిన జో బైడెన్.. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి తన సంతాపం తెలిపారు. ‘‘ఈ దాడుల్లో పౌరులు మరణించారు, చాలామంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తోన్న పుతిన్.. ఈ దాడులతో మరోసారి తన క్రూరత్వాన్ని ప్రదర్శించారు’’ అని బైడెన్ అన్నారు. ‘‘ఈ దాడులు.. ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలబడాలనే నిబద్ధతను మరింత బలపరిచాయి. మా మిత్రదేశాలు, పార్ట్‌నర్స్‌తో కలిసి.. రష్యాపై మరిన్ని చర్యలు తీసుకుంటాం. తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం, స్వాతంత్రం పొందడం కోసం.. ఉక్రెయిన్‌కు సహకారం అందిస్తూనే ఉంటాం’’ అని బైడెన్ చెప్పారు. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. ఈ దాడులు ఉక్రెయిన్ స్ఫూర్తిని గానీ, ఆ దేశానికి మద్దతు ఇవ్వాలనే అమెరికా సంకల్పాన్ని గానీ విచ్ఛిన్నం చేయలేవన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక, మానవతా, భద్రతా సహాయాన్ని అందించడం కొనసాగిస్తుంది పేర్కొన్నారు.

కాగా.. ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే.. రష్యా, క్రిమియాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెనను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. దానికి ప్రతీకారంగానే.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సహా ఇతర నగరాల్లో రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ పేలుళ్ల కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగింది. 11 మంది మరణించగా.. అనేకమంది గాయపడ్డారు.

Exit mobile version