Japan Centenarians: జపాన్ పేరు చెప్పగానే ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే ప్రజలు గుర్తొస్తారు. ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన రికార్డు సృష్టించింది. జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య తొలిసారి లక్ష దాటింది. ప్రస్తుతం అక్కడ 1,07,677 మంది శతాబ్ది వృద్ధులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో ఏకంగా 88 శాతం మంది మహిళలే కావడం మరో విషయం. అసలు జపాన్‌లో ఇంతమంది వందేళ్లు దాటిన వృద్ధులు ఎలా ఉన్నారు? వారి జీవనశైలిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అదే సమయంలో ఇంత పెద్ద వృద్ధ జనాభా ఆ దేశానికి ఎలాంటి సవాళ్లు తీసుకొస్తోంది? అనే వివరాల్లోకి వెళ్తే..
జపాన్‌లో ప్రస్తుతం అత్యధిక వయసున్న మహిళగా క్యోటోకు చెందిన కిషిమోటో ఫుయో ఉన్నారు. ఆమె వయసు 114 సంవత్సరాలు. ఇక అత్యంత వయసున్న పురుషుడిగా కుమామోటోకు చెందిన కటో హికారు ఉన్నారు. ఆయన వయసు 112 సంవత్సరాలు. దేశంలో ఇంతమంది వృద్ధులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, చురుగ్గా జీవించడం ఆనందంగా ఉందని ఆరోగ్య మంత్రి కెనిచిరో ఉయెనో పేర్కొన్నారు. వైద్య రంగంలో వచ్చిన పురోగతి, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రజల ఆయుర్దాయం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. అయితే ఇదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో సామాజిక భద్రతా వ్యవస్థను కొనసాగించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోంది.
జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి వారి ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణంగా చెబుతారు. సాధారణంగా వారి ఆహారంలో చేపలు, కూరగాయలు, అన్నం ఎక్కువగా ఉంటాయి. కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు వయసు పెరిగిన తర్వాత కూడా చాలామంది పూర్తిగా ఓ మూలన కూర్చోరు. నడక, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలను చేస్తారు. అలాగే అవసరమైనప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించడం వంటి రోజువారీ అలవాట్లు కూడా వాళ్ళు ఆ వయసులో యాక్టివ్ గా ఉండేందుకు దోహద పడుతున్నాయి.
అయితే జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో వారి అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్ కూడా మారుతోంది. దాదాపు పదేళ్లకు పైగా అక్కడ పిల్లల డైపర్ల కంటే పెద్దలకు ఉపయోగించే డైపర్ల విక్రయాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వృద్ధులు రోజువారీ పనులు సులభంగా చేసుకునేందుకు శరీర కదలికలకు సహాయపడే పవర్డ్ ఎక్సోస్కెలిటన్‌లు, అవసరాన్ని బట్టి ఫోకస్ మార్చుకునే ఐవేర్ వంటి టెక్నాలజీ ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి.
మరోవైపు జపాన్ ఎదుర్కొంటున్న అసలు సమస్య జనాభా తగ్గుదల. ఒక దేశ జనాభా స్థిరంగా కొనసాగాలంటే ప్రతి మహిళకు సగటున 2.1 మంది పిల్లలు పుట్టాలి. కానీ జపాన్‌లో ఫెర్టిలిటీ రేటు గతేడాది రికార్డు స్థాయిలో 1.14కి పడిపోయింది. 2008లో సుమారు 12.8 కోట్లుగా ఉన్న జపాన్ జనాభా 2070 నాటికి 8.7 కోట్లకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 65 ఏళ్లు పైబడిన వారు దేశ జనాభాలో దాదాపు 30 శాతం ఉండగా, 2070 నాటికి ఈ వాటా సుమారు 40 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.
ఇక పిల్లల పెంపకానికి జపాన్ ప్రభుత్వం సబ్సిడీలు, పలు ప్రోత్సాహక పథకాలు తీసుకొచ్చినా జననాల రేటులో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. వివాహాల సంఖ్య తగ్గడం, మహిళలు కూడా ఉద్యోగాల బాట పట్టడం, పిల్లలను పెంచే ఖర్చులు అధికం కావడం వంటి అంశాలను ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. వలసల ద్వారా జనాభా లోటును కొంతవరకు భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, విదేశీయులు ఇప్పటికీ జపాన్ జనాభాలో చిన్న వాటానే కలిగి ఉన్నారు.
జపాన్‌లో 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తీరు కూడా ఆసక్తికరమే. 1963లో 100 ఏళ్లు పైబడిన వారి సంఖ్యను ప్రభుత్వం లెక్కించినప్పుడు కేవలం 153 మంది మాత్రమే ఉన్నారు. 1981లో ఆ సంఖ్య వెయ్యి దాటింది. 1998 నాటికి పది వేలకు చేరుకుంది. ఇప్పుడు మాత్రం లక్షను దాటి 1,07,677కు చేరింది. ప్రతి ఏడాది వృద్ధుల పట్ల గౌరవాన్ని చాటే ప్రత్యేక ప్రభుత్వ సెలవు రోజున 100 ఏళ్లు పూర్తిచేసుకున్న వారికి ప్రభుత్వం ఇప్పుడు సత్కారాలు కూడా అందిస్తుంది.
అంటే జపాన్ ఒకవైపు ఆరోగ్యకరమైన జీవనశైలి, మెరుగైన వైద్యం, దీర్ఘాయువుకు ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంటే, మరోవైపు అదే దీర్ఘాయువు కారణంగా పెరుగుతున్న వృద్ధ జనాభా, తగ్గుతున్న జననాలు, క్షీణిస్తున్న జనాభా వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. వందేళ్లు దాటిన వారి సంఖ్య లక్ష దాటడం ఒక అరుదైన రికార్డే అయినప్పటికీ, ఆ రికార్డు వెనుక జపాన్ భవిష్యత్తును ప్రభావితం చేసే మార్పు కూడా దాగి ఉంది.

