Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్‌-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?

  • ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్‌-జీ ముప్పు
  • యువతలో పెరుగుతున్న వ్యతిరేకత
  • 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
Itly3

Itly3

జెన్‌-జీ ఉద్యమంతో ఆయా దేశాల్లో ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలే ఉదాహరణ. ఇటీవల భారత్‌లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమం జరిగింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇప్పుడు మరో దేశానికి జెన్-జీ ముప్పు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటలీ ప్రధాని మెలోనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో 2027 ఎన్నికల ముందు మెలోనీకి పెద్ద ఝలక్ తగిలేటట్టుగానే కనిపిస్తోంది.

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రభుత్వానికి 2027 జాతీయ ఎన్నికల ముందు యువ ఓటర్ల నుంచి సవాలు ఎదురవుతోంది. ముఖ్యంగా 35 ఏళ్లలోపు ఓటర్లు, జనరేషన్ జెడ్‌లో మెలోనీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. రాయిటర్స్ వెల్లడించిన YouTrend పోలింగ్ ప్రకారం.. 35 ఏళ్లలోపు ఓటర్లలో మెలోనీ నేతృత్వంలోని రైట్‌వింగ్ కూటమికి 30 శాతం కంటే తక్కువ మద్దతు ఉండగా.. సెంటర్-లెఫ్ట్ ప్రతిపక్షానికి దాదాపు 50 శాతం మద్దతు ఉంది. దీంతో 2027లో జరగనున్న ఇటలీ జాతీయ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో ఓటు వేస్తే.. ఫలితాలను నిర్ణయించే స్థాయిలో వారి ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మెలోనీకి దూరం

యువతలో మెలోనీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి ప్రధాన కారణం ఆర్థిక సంస్కరణలు లేకపోవడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2022లో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు, వేతనాలు, విద్య వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మార్పులు తీసుకురాలేదని పేర్కొంటున్నారు. రోమ్‌లోని లూయిస్ యూనివర్సిటీకి చెందిన రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ లోరెంజో డి సియో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు యువతకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదని పేర్కొన్నారు. యూరోస్టాట్ గణాంకాల ప్రకారం.. 15 నుంచి 24 ఏళ్ల వయసున్న యువత ఉపాధి రేటు 21 సభ్య దేశాల యూరో జోన్‌లో ఇటలీలోనే అత్యల్పంగా ఉంది. విద్య కోసం ఇటలీ ఖర్చు చేస్తున్న మొత్తమూ అనేక యూరో జోన్ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది.

వేతనాల్లో భారీ వ్యత్యాసం

ఇక యువ ఇటాలియన్లకు మరో ప్రధాన సమస్య వేతనాలు. బ్యాంక్ ఆఫ్ ఇటలీ గణాంకాల ప్రకారం.. జర్మనీలోని యువ గ్రాడ్యుయేట్ సగటున సంపాదించే మొత్తంతో పోలిస్తే.. అదే స్థాయి విద్యార్హతలు ఉన్న ఇటలీ గ్రాడ్యుయేట్ సుమారు 80 శాతం తక్కువగా సంపాదిస్తున్నాడు. దీంతో ఇటలీ నుంచి యువ గ్రాడ్యుయేట్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో లక్ష మందికి పైగా యువ గ్రాడ్యుయేట్లు ఇటలీని విడిచిపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ ఇటలీ వెల్లడించింది. మెలోనీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఆమె అప్రూవల్ రేటింగ్‌లోనూ కనిపిస్తోంది. YouTrend ప్రకారం.. 35 ఏళ్లలోపు ఓటర్లలో కేవలం 25 శాతం మంది మాత్రమే ఆమె ప్రభుత్వ పనితీరును ఆమోదిస్తున్నారు. మొత్తం జనాభాలో ఈ రేటు 35 శాతంగా ఉంది.

ఇటలీలో యువ ఓటర్ల రాజకీయ వైఖరిలో లింగపరమైన విభజన కూడా కనిపిస్తోంది. బోకోనీ యూనివర్సిటీ, SWG పోలింగ్ డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. యువ పురుషులు రైట్‌వింగ్ పార్టీల వైపు మొగ్గు చూపుతుండగా.. యువ మహిళలు వామపక్ష పార్టీలకు ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న యువ పురుషుల్లో 15 శాతం మంది Brothers of Italy పార్టీకి మద్దతు తెలిపారు. అదే వయసు మహిళల్లో ఈ మద్దతు కేవలం 4.2 శాతంగా ఉంది. మరోవైపు 30 ఏళ్లలోపు మహిళల్లో 18 శాతం మంది Five Star Movementకు మద్దతు ఇవ్వగా.. పురుషుల్లో ఈ మద్దతు 5.1 శాతంగా ఉంది. అంటే మెలోనీకి యువత దూరమవుతోందని చెప్పినా.. యువ ఓటర్లందరూ ఒకే రాజకీయ దిశలో వెళ్తున్నారని భావించలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

మెలోనీ కూటమి కోల్పోతున్న మద్దతులో గణనీయమైన భాగం సెంటర్-లెఫ్ట్ ప్రతిపక్షం వైపు వెళ్తోంది. అయితే పరిస్థితి అంత సులభంగా లేదు. మెలోనీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొంతమంది ఓటర్లను ఫార్-రైట్ పార్టీలు కూడా ఆకర్షిస్తున్నాయి. ఫిబ్రవరిలో మాజీ ఆర్మీ జనరల్ రొబెర్టో వన్నాచి ఏర్పాటు చేసిన National Future పార్టీ ప్రస్తుతం సుమారు 7 శాతం ఓట్లతో ఉందని రాయిటర్స్ పేర్కొంది. మధ్య వయసు పురుషుల్లో ఈ పార్టీకి ఎక్కువ మద్దతు ఉన్నప్పటికీ.. వలసలకు వ్యతిరేకంగా ఉన్న పట్టణ ప్రాంత యువతలోనూ వన్నాచి ప్రభావం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మెలోనీకి మద్దతు తగ్గడం తప్పనిసరిగా సెంటర్-లెఫ్ట్‌కు లాభంగా మారుతుందని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

యువత ఆగ్రహం

మెలోనీ ప్రభుత్వం అనుసరిస్తున్న లా అండ్ ఆర్డర్ విధానాలు కూడా యువతలో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. రేవ్ పార్టీలపై చర్యలు, ‘లైట్’ క్యానబిస్ ఉత్పత్తిపై ఆంక్షలు, నిరసనలు, అక్రమ ఆక్రమణలు, బాల నేరాలకు సంబంధించిన కఠిన నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజా భద్రతను మెరుగుపరచడం, నేరాలను అరికట్టడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ చర్యలు యువతపై అధిక ప్రభావం చూపుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గత నవంబర్‌లో వేలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ‘No Meloni Day’ పేరుతో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ భద్రతా డిక్రీలు, విద్యా రంగంలో కోతలు, గాజా యుద్ధంపై మెలోనీ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఇటలీలో చాలా కాలంగా యువ ఓటర్లలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో.. వారి అసంతృప్తి ఎన్నికల ఫలితాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే ఇటీవల జరిగిన న్యాయ వ్యవస్థ సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణలో పరిస్థితి మారింది. 35 ఏళ్లలోపు ఓటర్లలో సుమారు 67 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నట్లు రాయిటర్స్ పేర్కొంది. వారిలో 60 శాతం మంది ప్రతిపాదిత సంస్కరణను తిరస్కరించారు. మొత్తం ఓటింగ్ శాతం 59 కాగా.. 54 శాతం మంది సంస్కరణకు వ్యతిరేకంగా ఓటేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఇటలీ ఎన్నికల్లో యువ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తే.. మెలోనీ ప్రభుత్వ భవితవ్యంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.