NTV Telugu Site icon

Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి.. తీవ్రంగా స్పందించిన నెతన్యాహు

Israelisoccerfansattacked

Israelisoccerfansattacked

నెదర్లాండ్‌లో పాలస్తీనీయులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్‌ పౌరులపై ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఇజ్రాయెల్ పౌరులపై ఒక గుంపు మూక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడికి సంబంధించి అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది. మక్కాబి టెల్ అవీవ్ అభిమానులు స్టేడియం నుంచి బయటకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా వెల్లడించింది.

నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో గురువారం రాత్రి మక్కాబి టెల్ అవీవ్ వర్సెస్ అజాక్స్ ఆమ్‌స్టర్‌డామ్ మధ్య యూరోపా లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అభిమానులు నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అయితే ఇదే అదునుగా పాలస్తీనా గుంపు రెచ్చిపోయింది. ఇజ్రాయెలీ సాకర్ అభిమానులుపై భౌతికదాడులకు పాల్పడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లుగానే చితకకొట్టారు. పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం.. ఇలా ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. దాడి చేయొద్దంటూ వేడుకున్నా.. కనికరించకుండా కొడుతూనే ఉన్నారు. డబ్బులు, పాస్‌పోర్టులు కూడా వారి దగ్గర నుంచి లాగేసుకున్నారు. దాడి చేసినవాళ్లు అరబిక్‌లో పాలస్తీనా నినాదాలు చేస్తూ చెలరేగిపోయారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానులను రప్పించేందుకు రెండు విమానాలను ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపాలని అధికారులకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. అలాగే ఇజ్రాయెల్ పౌరులకు రక్షణ కల్పించాలని డచ్ అధికారులను కోరారు. పాలస్తీనీయుల దాడిలో దాదాపు 10 మంది ఇజ్రాయెలీయులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి వ్యక్తుల ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. దాడికి పాల్పడ్డవారు కొంత మందిని టార్గెట్ చేసుకుని.. పాస్‌పోర్టులు దొంగిలించనట్లుగా తెలుస్తోంది.

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తన పౌరులకు కీలక సూచనలు చేసింది. నెదర్లాండ్స్‌లోని ఇజ్రాయెల్ పౌరులు ఇంటి లోపల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. ఇక ఇజ్రాయెల్‌ పౌరులు సురక్షితంగా విమానాశ్రయానికి చేరుకునేందుకు సహాయపడాలని డచ్ అధికారులను కోరారు.

ఇక ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ దాడులను ఖండించారు. ఇజ్రాయెల్‌ పౌరులను కొట్టడం, తన్నడం, రన్ ఓవర్ చేయడం, నదిలోకి విసిరేయడం యూదు వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మాట్లాడుతూ.. తక్షణ చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. తదుపరి హింస జరగకుండా అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. ఇజ్రాయెలీయులతో.. బలవంతంగా జై పాలస్తీనా అనిపించినట్లుగా తెలుస్తోంది.

ఏడాదికి పైగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా ధ్వంసమైంది. అనేక మంది పౌరులతో సహా నాయకులు హతమయ్యారు. దీన్ని మనసులో పెట్టుకుని ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా అనుకూల గుంపు దాడి చేసినట్లుగా తెలుస్తోంది.