NTV Telugu Site icon

Yahya Sinwar: హమాస్ చీఫ్, అక్టోబర్ 07 దాడుల మాస్టర్ మైండ్ హతం.. ఇజ్రాయిల్ హిట్ లిస్టులో తొలిపేరు…

Yahya Sinwar

Yahya Sinwar

Yahya Sinwar: ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత, ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ వార్త నిజమైతే హమాస్‌ని కూకటివేళ్లతో పెకిలించినట్లే. పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ఇదే మాట చెప్పాడు. తాము హమాస్‌ని మట్టుపెట్టేదాకా యుద్ధం ఆపేది లేదని స్పష్టం చేశాడు. తాజాగా సిన్వార్ మరణంతో ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.

గాజా దక్షిణ ప్రాంతమైన రఫాలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చేసిన ఆపరేషన్‌లో సిన్వార్ మరణించినట్లు తెలుస్తోంది. సిన్వార్ చనిపోయినట్లు పలువురు ఇజ్రాయిలీ అధికారులు ధృవీకరించారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిన్వార్‌తో సహా ముగ్గురు హమాస్ మిలిటెంట్లు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇజ్రాయిలీ బందీలకు సంబంధించిన ఆనవాళ్లు లేవు.

అక్టోబర్ 07 నాటి దాడులకు సూత్రధారి:

గతేడాది అక్టోబర్ 07న హమాస్ రాకెట్లతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు చంపేశారు. ఆడామగా, పిల్లలు అనే తేడా లేకుండా 1200 మందిని హతమార్చారు. 251 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో 90 మంది వరకు ఇంకా గాజాలో బందీలుగానే ఉన్నారు. అప్పటి నుంచి హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వార్. దాడికి రెండేళ్ల కాలం నుంచి ఇతను ప్లాన్ చేస్తూ ఉన్నాడు.

ఇజ్రాయిల్ హిట్ లిస్ట్‌లో తొలిపేరు:

ఇజ్రాయిల్ గత కొన్నేళ్లుగా సిన్వార్ గురించి వెతుకుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 07 దాడి తర్వాత సిన్వార్ ఇజ్రాయిల్ ప్రైమ్ టార్గెట్‌గా మారాడు. ఇటీవల ఇరాన్ టెహ్రాన్‌లో అనూహ్య పరిస్థితుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియే హతమార్చబడ్డాడు. ఆ తర్వాత ఈ స్థానంలోకి అంటే, హమాస్ చీఫ్‌గా సిన్వార్ బాధ్యతలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హతమయ్యాడు.

నిజానికి సిన్వార్ గాజాలోని భూగర్భ సొరంగాల్లోనే తన భార్య, పిల్లలతో ఉంటాడు. అతడిని రక్షించడానికి బాడీగార్డ్స్ ఉంటారు. దాదాపుగా ఇజ్రాయిల్ జైలులో 22 ఏళ్ల గడిపిన సిన్వార్, 2011లో ఇజ్రాయిల్ సైనికులు కిడ్నాప్ చేయబడిన సమయంలో, హమాస్-ఇజ్రాయిల్ మార్పిడి ఒప్పందంలో భాగంగా విడుదలై గాజాలోకి వెళ్లాడు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకపోవడం, ఎక్కువగా కనిపించకపోవడమే సిన్వార్ ఇంత కాలం బతికేందుకు కారణమైంది. ఒక వేళ సిన్వా్ర్ ఒక్క తప్పు చేసినా, ఇజ్రాయిల్ ఎప్పుడో అతడిని హతమార్చేది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పలువురు హమాస్ కీలక నేతలు, కమాండర్లు చనిపోయినా.. సిన్వార్ జాడ దొరకలేదు. సిన్వార్ నేతృత్వంలోనే హమాస్ గాజాలో ఏళ్ల తరబడి భూగర్భ సొరంగాలను నిర్మించింది.

గాజా యుద్ధం తీవ్రం కావడంతో సిన్వార్ దాదాపుగా ఎలక్ట్రానిక్ డివైజెస్‌ని వాడటం మానేశాడు. కేవలం కొరియర్ వ్యవస్థపేనే ఆధారపడ్డాడు. ఒకానొక సమయంలో తన స్థానాలను మార్చేందుకు బుర్ఖాలు ధరించి, ఆడవేషధారణలో ఉంటున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.