NTV Telugu Site icon

Israel: హమాస్ మిలిటరీ చీఫ్ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడి.. 71 మంది మృతి..

Israel

Israel

Israel: ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా శనివారం గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 71 మంది మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిలో డీఫ్ మరణించాడా..? లేదా..? అనేది అస్పష్టంగా ఉంది. గాజాలో దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌కి పశ్చిమాన ఉన్న మానవతా జోన్ అల్-మవాసిలోని ఒక భవనంలో డీఫ్ దాక్కున్నాడని ఇజ్రాయిల్ ఆర్మీ రేడియో తెలిపింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం ఇజ్రాయిల్ ఈ మానవతా ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో మెరుపుదాడి చేసింది.

Read Also: IND vs ZIM: రాణించిన సికిందర్ రజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

గాజా యుద్ధానికి కారణమైన ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 7 నాటి దాడికి మిలిటరీ చీఫ్ మహ్మద్ ఢీప్ ప్రధాన సూత్రధారుల్లో ఒకరు. ఇతడిని మట్టుపెట్టేందుకు ఇజ్రాయిల్ ఇప్పటి వరకు 7 హత్యాయత్నాలు చేసినప్పటికీ, అందులో నుంచి బయటపడ్డాడు. చివరిసారిగా 2021లో ఇజ్రాయిల్ ఇతడిని హతమార్చే ప్రయత్నం చేసింది. దశాబ్ధాలుగా ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో డీఫ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇజ్రాయిల్ తాజాగా జరిపిన దాడిలో 71 మంది గాజా ప్రజలు మరణించారని, 289 మంది గాయపడ్డారని గాజా అధికారులు చెప్పారు. గత 30 ఏళ్లలో డీఫ్ గాజాలో సొరంగాల నెట్వర్క్‌ని డెవలప్ చేయడంతో పాటు బాంబు తయారీ నైపుణ్యాలను పెంచాడు. ఆత్మాహుతి బాంబు దాడులతో డజన్ల మంది ఇజ్రాయిలీల మరణాలకు ఇతను కారణమయ్యాడు. అక్టోబర్ 07 నాటి దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలను హమాస్ మిలిటెంట్లు హతమార్చారు. 250 మందిని బందీలుగా పట్టుకున్నాడు. ఈ యుద్ధం కారణంగా గాజాలోని 38 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.