Israel Politics: మిడిలీస్ట్‌ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!

Israel Politics

Israel Politics

Israel Politics: ఒక్క ఆదేశంతో పశ్చిమాసియా ముఖచిత్రాన్నే మార్చేసిన దేశం.. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మిలిటరీ సూపర్ పవర్.. అదే ఇజ్రాయెల్. ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన ప్రశ్న ఒక్కటే “మిడిలీస్ట్‌ను వణికించిన ఈ దేశానికి నెక్ట్స్ బాస్ ఎవరు?. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమాసియా రాజకీయాలను అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిప్పాయి. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 61.

కానీ సుదీర్ఘకాలం ఇజ్రాయెల్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూటమికి దక్కింది కేవలం 53 సీట్లే. మరోవైపు, ఆయన బద్ధ ప్రత్యర్థి, మాజీ ఆర్మీ చీఫ్ గాదీ ఐజెన్‌కోట్ నేతృత్వంలోని విపక్ష శిబిరానికి అరబ్ పార్టీల మద్దతుతో కలిపి ఏకంగా 67 మంది ఎంపీల సిఫార్సు దక్కింది. లెక్కల ప్రకారం చూస్తే నెతన్యాహు పనైపోయినట్లే కనిపించినా.. గద్దెపై కూర్చునే అసలైన “బాస్” ఎవరనే సస్పెన్స్ మాత్రం వీడటం లేదు. సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఐజెన్‌కోట్ సులువుగా ప్రధాని కావాలి. కానీ ఆయన బలం అత్యంత బలహీనమైన పునాదులపై ఆధారపడి ఉంది. ఐజెన్‌కోట్ కూటమికి సొంతంగా ఉన్నది 48 సీట్లు మాత్రమే. ఆయనకు మెజారిటీ దక్కడానికి కారణమైన 19 మంది ఎంపీలు అరబ్ పార్టీలకు చెందినవారు.

ఇజ్రాయెల్ రాజకీయాల్లో అరబ్ పార్టీలతో అధికారాన్ని పంచుకునేందుకు యూదు పక్షాలు సాధారణంగా అంగీకరించవు. విపక్ష కూటమిలోని పలు గ్రూపులు అరబ్ పార్టీలతో కలిసి ఒకే మంత్రివర్గంలో కూర్చోవడానికి ససేమిరా అంటున్నాయి. సిద్ధాంతాలు కలవని ఈ బద్ధ శత్రువులంతా ఒక తాటిపైకి వచ్చి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కత్తిమీద సాములా మారింది. విపక్షాల ఈ అంతర్గత కలహాలే ఇప్పుడు పీఠంపై కన్నేసిన వారికి పెద్ద అస్త్రంగా మారాయి.

‘మిషన్ 61’తో నెతన్యాహు మైండ్‌గేమ్

రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నెతన్యాహు అధికారాన్ని అంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తన కూటమిని గట్టెక్కించేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు ఇరుపక్షాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో తనతో విభేదించి దూరం జరిగిన పాత మిత్రపక్షం అల్ట్రా-ఆర్థోడాక్స్ పార్టీ ‘యునైటెడ్ తోరా జుడాయిజం’ చేతిలో 7 సీట్లు ఉన్నాయి. మిలిటరీ సర్వీస్ వివాదంలో తటస్థంగా ఉన్న వీరిని మళ్లీ తన గూటికి రప్పించగలిగితే నెతన్యాహు బలం 60కి చేరుతుంది. అప్పుడు కేవలం ఒక్కటంటే ఒక్క ఎంపీని తనవైపు తిప్పుకుంటే మళ్లీ ఆయనే బాస్ అవుతారు. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఐజాక్ హెర్జోగ్ ముందుగా ఐజెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 28 రోజుల గడువు (అవసరమైతే మరో 14 రోజుల పొడిగింపు) ఇస్తారు. ఈ నిర్ణీత సమయంలోగా ఐజెన్‌కోట్ మెజారిటీని నిరూపించలేకపోతే, రాష్ట్రపతి నెతన్యాహుకు అవకాశం ఇచ్చే ద్వారాలు తెరుచుకుంటాయి. నెతన్యాహు-ఐజెన్‌కోట్ ఇద్దరూ కలిసి జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, చెరిసగం కాలం పీఎం పదవిని పంచుకునే ప్రత్యామ్నాయం కూడా తెరపైకి వస్తోంది. ఐజెన్‌కోట్ ప్రస్తుతానికి నెతన్యాహుతో అధికారం పంచుకోవడానికి విముఖత చూపినా, డెడ్‌లాక్ ఏర్పడితే రాజీ తప్పకపోవచ్చు.

బాస్ మారతాడా.. మళ్లీ పాత సారథే నిలుస్తాడా

అన్ని ప్రయత్నాలు విఫలమై, ఇరు కూటముల్లో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే ఇజ్రాయెల్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. అలా జరిగితే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు తాత్కాలిక (కేర్‌టేకర్) ప్రధానిగా నెతన్యాహే కొనసాగుతారు. శత్రుదేశాల గుండెల్లో నిద్రపోతూ, సైనిక చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ దేశానికి సరికొత్త సారథి వస్తాడా? లేక ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా రాజకీయ చక్రం తిప్పుతూ వస్తున్న పాత బాసే మళ్లీ పగ్గాలు చేపడతాడా? అన్నది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.