NTV Telugu Site icon

Syriya-Israel: సిరియాలో 80 శాతం అస్తులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడి

Isralepm

Isralepm

సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకున్నారు. అసద్ పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నారు. ఇక సిరియా రెబల్స్ చేతుల్లోకి వెళ్లాక.. ఐడీఎఫ్ దళాలు దాడులు సాగిస్తోంది. సిరియా ఆయుధ సంపత్తి.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లకుండా ఆయుధాలను ధ్వంసం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అసద్ నిష్క్రమణ తర్వాత 80 శాతం సిరియా సైనిక ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. వ్యూహాత్మక స్థావరాలు, పలు కీలక నగరాల్లో వందల సంఖ్యలో దాడులు నిర్వహించింది. గత 48 గంటల్లో 400 కంటే ఎక్కువ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం తెలిపింది.

గత ఆదివారం 24 ఏళ్ల అసద్ నియంత పాలన అంతమైంది. సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అనంతరం ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా అసద్ అధికారిక నివాసాన్ని కూడా దోచుకున్నారు. ఎవరికి దొరికిన వస్తువులు.. వాళ్లు తీసుకుపోయారు. డమాస్కస్ ప్రస్తుతం రెబల్స్ చేతుల్లో ఉంది.

అసద్ పతనంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. అసద్ పతనం.. పశ్చిమాసియాలో చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. ఇరాన్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల కారణంగానే.. అసద్‌కు ఎవరు మద్దతిచ్చేందుకు మందుకు రాలేదని నెతన్యాహు పేర్కొన్నారు. అణచివేత పాలన నుంచి సిరియా ప్రజలు విముక్తి పొందారని పేర్కొన్నారు. నవంబర్ 27న ప్రారంభమైన మెరుపు దాడిలో సిరియన్ తిరుగుబాటుదారులు అసద్ మరియు అతని తండ్రి హఫీజ్ అల్-అస్సాద్ ఐదు దశాబ్దాలకు పైగా పాలించిన పాలనను పడగొట్టారు .

సిరియాకు ఇరాన్, రష్యా, హిజ్బుల్లా మద్దతు ఉండేది. కానీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నా.. ఎవరు పట్టించుకోలేదు. ఈ మూడు దేశాలు ఎలాంటి సాయం చేయలేదు. దీంతో అసద్ చేతులెత్తేశారు. అనంతరం ప్రాణభయంతో అసద్ రష్యాకు పారిపోవల్సి వచ్చింది. ఇదిలా ఉంటే అమెరికా మద్దతుతో సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోపించారు. ఇదే అదునుగా సిరియా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందని.. అంతర్జాతీయ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కేవలం రెబల్స్ చేతుల్లోకి ఆయుధాలు వెళ్లకూడదన్న ఆలోచనతోనే సిరియాపై దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.

 

 

Show comments