పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ధనిక రాజ్యాలు అనబడిన దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చమురు, గ్యాస్ సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు మరో సంక్షోభం ముంచుకొస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలకు ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులంతా హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నౌకలు నిలిచిపోయాయి. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో అన్ని ధరలు ఆకాశన్నంటయ్యాయి. ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు సంక్షోభంలోకి కూరుకుపోయాయి. దీంతో చాలా దేశాలు కఠినమైన పొదుపు సూత్రాలు పాటిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా అమలవుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ కొత్త వ్యూహం పన్నినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒకెత్తు అయితే.. ఇక జరగబోయేది మరోకెత్తుగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధి గురించే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లు గురించి చర్చ జరుగుతోంది. ఇరాన్ కొత్త వ్యూహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితులు రావొచ్చని ఆందోళనలు కలుతున్నాయి.
ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మీడియా కథనాల ప్రకారం.. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే సబ్‌సీ ఇంటర్నెట్ కేబుళ్లపై నియంత్రణ సాధించే దిశగా టెహ్రాన్ ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలపై లైసెన్స్ ఫీజులు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ నియంత్రణలోకి తీసుకున్నా.. ఇంకేదైనా దుస్సాహసం చేసినా ప్రమాదమే.
ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి ఇటీవల సోషల్ మీడియాలో ‘‘ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు విధిస్తాం.’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అంతేకాదు.. ఇరాన్ చట్టాలకు లోబడి మాత్రమే కేబుల్ ఆపరేటర్లు పనిచేయాలన్న ప్రతిపాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
సముద్ర గర్భంలోని కేబుళ్లు ఎందుకు కీలకం?
ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు ఈ అండర్‌సీ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే ప్రధాన ఆధారం. బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఏ చెల్లింపులు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, అంతర్జాతీయ డేటా మార్పిడి, సైనిక కమ్యూనికేషన్ వంటి దాదాపు మొత్తం డిజిటల్ ట్రాఫిక్ ఈ కేబుళ్ల ద్వారానే సాగుతాయి. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌లను యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాతో అనుసంధానించే ప్రధాన మార్గాలు హార్ముజ్, ఎర్రసముద్రం ప్రాంతాల గుండా వెళ్తాయి. అందుకే ఇవి ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక మార్గాలుగా మారాయి. ఒకవేళ వీటికి నష్టం వాటిల్లితే అల్లకల్లోలమే జరుగుతుంది.
భారత్‌పై ప్రభావం..
ఒకవేళ ఇంటర్నెట్ కేబుళ్లకు అంతరాయం కలిగితే భారత్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హార్ముజ్ లేదా ఎర్రసముద్ర ప్రాంతాల్లో ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో అంతరాయం ఏర్పడితే భారత్‌లో ఇంటర్నెట్ సేవలు మందగించే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూపీఏ, బ్యాంకింగ్ లావాదేవీలు తీవ్రంగా దెబ్బతింటాయి. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అలాగే క్లౌడ్ సేవల్లో కూడా అంతరాయాలు ఏర్పడతాయి. అంతర్జాతీయ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడం, ఏఐ, డేటా సర్వీసుల పనితీరు దెబ్బతినడం, కార్పొరేట్ నెట్‌వర్క్‌ల్లో సమస్యలు ఏర్పడతాయి. దీంతో భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి.
ఇక భారత్‌కు సంబంధించిన కీలక సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్‌లలో AAE-1, Falcon Network, Tata TGN-Gulf, SEA-ME-WE 4, IMEWE వంటి వ్యవస్థలు ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవు.
ఇప్పటికే దెబ్బతిన్న కేబుళ్లు
గతేడాది భారత్‌ను ప్రపంచ టెలికాం నెట్‌వర్క్‌లతో అనుసంధానించే మూడు సముద్ర గర్భ కేబుళ్లు దెబ్బతిన్నాయి. దీంతో యూరప్‌కు వెళ్లే డేటా ట్రాఫిక్‌లో సుమారు 25 శాతం అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఇప్పుడు ప్రాంతీయ యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతో మరమ్మతు పనులు కూడా క్లిష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చట్టపరంగా ఇరాన్‌కు హక్కుందా?
1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తమ జలాల్లోకి వచ్చే కేబుళ్లపై కొన్ని నిబంధనలు విధించే హక్కు తీరప్రాంత దేశాలకు ఉందని ఇరాన్ వాదిస్తోంది. అయితే నిపుణులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ సముద్ర మార్గం కావడంతో ఇరాన్ పూర్తి నియంత్రణ సాధించడం అంత సులభం కాదని చెబుతున్నారు.
కొత్త ముప్పు
ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా మాత్రమే గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు అది ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రధాన చోక్‌పాయింట్‌గా మారుతోంది. చమురు సరఫరా ఎంత ముఖ్యమో.. డేటా ప్రవాహం కూడా అంతే కీలకమైందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఇంటర్నెట్ కేబుళ్లు దెబ్బతింటే మాత్రం ప్రపంచం తల్లకిందులవ్వడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను దెబ్బతీసేందుకు ఇరాన్ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం ఇదేనని తెలుస్తోంది. అమెరికాపై పగ తీర్చుకునేందుకు ఇరాన్ ఏదైనా చేస్తే మాత్రం ప్రపంచం ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏం జరగబోతుందో వేచి చూడాలి.
