Iran Crisis: ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికాతో యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షలు ఆ దేశానికి తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, అప్పుల భారాన్ని భరించలేక కొందరు తమ శరీర భాగాలను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జ, వృషణాలను కూడా అమ్మకానికి పెడుతున్నట్లు ఇరాన్ వార్తాసంస్థ ILNA వెల్లడించింది.
మధ్య ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గోడలపై అవయవాలు అమ్ముతామని ప్రకటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘‘కిడ్నీ స్ట్రీట్’’గా పిలిచే ఫర్హంగ్ హెస్సేనీ వీధిలో ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే మున్సిపల్ వైద్య కేంద్రం, కిడ్నీ రోగులకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ ఉండటంతో అవయవాలను కొనుగోలు చేయాలనుకునే వారు అక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రజలు తమ అవయవాలను అమ్ముకునేందుకు వస్తున్నారని అక్కడి ఆస్పత్రి ఉద్యోగులు చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్‌ను బట్టి ధర మారుతుందని, అరుదైన బ్లడ్ గ్రూప్‌లకు ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని చెబుతున్నారు. కిడ్నీ ధరలు సుమారు 30 బిలియన్ నుంచి 40 బిలియన్ ఇరానియన్ రియాళ్ల వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది సుమారు 11,500 నుంచి 15,300 అమెరికన్ డాలర్లకు సమానం. కిడ్నీలే కాకుండా ఇతర శరీర అవయవాలను అమ్మేసి అప్పులు తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు.

