Site icon NTV Telugu

తాలిబన్లలో అంతర్గత కుమ్మలాట.. అగ్రనేత అలక..!

ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు ఇప్పుడు అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి.. కీలకస్థానాల్లో ఉన్న నేతలే అలకబూనడం తాలిబన్లకు సమస్యగా మారింది.. అయితే, తాలిబన్ల కేబినెట్‌లో ఉన్నవారంతా కరడుగట్టిన ఉగ్రవాదులే.. హక్కానీ నెట్‌వర్క్‌ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు… అయితే, కేబినెట్‌లో చోటు విషయంలో ఆచరణవాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు ప్రచారం సాగింది.. ఇరు వర్గాల మధ్య దేశాధ్యక్ష భవనంలో పెద్ద గొడవ జరిగిందని.. ఆ ఘర్షణలో ఆచరణవాదుల వర్గానికి నేతృత్వం వహిస్తున్న ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ప్రాణాలు వదిలారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.. ఆ తర్వాత తనకు ఏమీ కాలేదంటూ ఓ ప్రకటన విడుదల చేసిన బరాదర్‌.. ఇక, ఈ వారంలో టీవీలో కూడా ప్రత్యక్షం అయ్యారు.. కానీ, కేబినెట్‌ ఏర్పాటు మాత్రం బరాదర్‌కు నచ్చడంలేదని ఆయన వర్గానికి చెందినవారు చెబుతున్నమాట.. అందుకే, ఉప ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇక, తాజాగా ఆఫ్ఘన్ పర్యటనకు వచ్చారు కతర్‌ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుర్‌ రహమాన్‌ అల్‌-థనీ.. కానీ, ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా బరాదర్‌ రాకపోవడం చర్చగా మారింది.. అమెరికాతో జరిగిన చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ఆయన.. ప్రస్తుతం అలకబూని ఇలా దూరంగా ఉండడం తాలిబన్‌ సర్కార్‌కు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఓవైపు.. తమ అరాచకపాలన కొనసాగిస్తున్నారు తాలిబన్లు.. మహిళలు, విద్యార్థినులపై ఆంక్షలు పెట్టారు.. మహిళలు ఎలాంటి క్రీడలు ఆడాల్సిన అవసరం లేదని ఆదేశించారు.. తమ విధానాలను అమలులో పెట్టేస్తున్నారు.. కానీ, అంతర్గత కుమ్మలాటలు, అలకలు మాత్రం వారికి ఇబ్బందిగా మారుతున్నాయంటున్నారు.

Exit mobile version