భారత్, చైనా మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలున్న సంగతి తెలిసిందే. చాలా అంశాల్లో ఆ దేశంతో భారత్ పోరాడుతోంది. చైనా ఎప్పటికప్పుడు భారత్‌పై కొత్త కుట్రలు చేస్తూ ఉంటుంది. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీన్ని భారత్‌పై వాటర్ బాంబ్ లాగా వాడుకునేందుకు చైన్ స్కెచ్ వేసిందనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా సిద్ధమైంది.
బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మిస్తోంది. తమ దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. బ్రహ్మపుత్ర నది మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అసో రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. కానీ మన ఎగువన ఈ నది చైనాలోని టిబెట్ లో ప్రవహిస్తుంది. దీన్ని అక్కడ యార్లుంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు. దీనిపై అతి పెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మిస్తోంది చైనా. దీని పేరు మెడాగ్ హైడ్రోపవర్ స్టేషన్. దీన్ని మోటువో హైడ్రోపవర్ స్టేషన్ అని కూడా పిలుస్తారు.
బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన చైనాకు 2020లో వచ్చింది. అప్పటి నుంచి దీనిపై పని చేస్తోంది. 2020లో చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ గురించి వెల్లడించింది. 2024 డిసెంబర్ 25న దీనికి అధికారికంగా ఆమోదం లభించింది. ఈ ఏడాది జూలై 19న ప్రధాని లి క్వాంగ్ ఈ ప్రాజుక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది టిబెట్‌లోని మెడాగ్ కౌంటీలో ఉన్న ‘గ్రేట్ బెండ్’ అనే ప్రదేశంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ నది U-ఆకారంలో తిరిగి, 50 కిలోమీటర్లలో 2000 మీటర్లు ఎత్తు తగ్గుతుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు అవుతుంది. దీన్ని 60వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇప్పుడు చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ డ్యామ్ కోసం చైనా 14 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. దీన్నిబట్టి ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
చైనా నిర్మిస్తున్న ఈ మెడాగ్ ప్రాజెక్టుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ డ్యామ్ వల్ల భారత్, బంగ్లాదేశ్ కు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడాగ్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని జరగదని, ఇదొక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు అని చైనా చెప్తోంది. కానీ భారత్, బంగ్లాదేశ్‌లో మాత్రం ఈ ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ డ్యామ్ వల్ల భారత్‌లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని చైనా నియంత్రించవచ్చు. వర్షాకాలంలో ఒక్కసారిగా నీటిని వదిలితే దిగువన ఉన్న భారత్, బంగ్లాదేశ్ లలో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. చైనా దీన్ని ‘వాటర్ బాంబ్’ లాగా ఉపయోగించవచ్చు. అందుకే దిగువ దేశాల హక్కులు దెబ్బతినకుండా చూడాలని చైనాకు భారత్ ఇప్పటికే సూచించింది. అయితే ఇది తమ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీని వల్ల ఎవరికీ హాని జరగదని చైనా చెప్తోంది.
చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తున్న భారత్ కూడా దిగువన భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అదే దిబాంగ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్. బ్రహ్మపుత్ర నదిపై దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును నిర్మించాలని భారత్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. కానీ అది ఇంతవరకూ సాకారం కాలేదు. ఇప్పుడు చైనా డ్యామ్ తో అప్రమత్తమైన భారత ప్రభుత్వం దిబాంగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్- NHPC దిబాంగ్ ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో నిర్మిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన దిబాంగ్ నదిపై దీన్ని చేపట్టనున్నారు. వాస్తవానికి 2024లోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ఇప్పుడు మొదలయ్యాయి. రోడ్లు, బ్రిడ్జిలు, టన్నెల్స్ నిర్మాణం జరుగుతోంది.
భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా బ్రహ్మపుత్ర నదికి అడ్డుకట్ట వేయొచ్చు. దీనివల్ల దిగువ రాష్ట్రాలు ఎంతో లబ్ది పొందుతాయి. దిబాంగ్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు ద్వారా వరదలను నియంత్రించవచ్చు. విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఒకవేళ ఎగువన చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే, ఈ డ్యామ్ దాన్ని అడ్డుకోగలుగుతుంది. అస్సాంలో వరదలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.చైనాపై భారత్ చేపట్టిన స్ట్రాటజిక్ మూవ్ గా దీన్ని భావిస్తున్నారు.
బ్రహ్మపుత్రపై భారత్ నిర్మిస్తున్న దిబాంగ్ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ కాబోతోంది. పోలవరంతో పోల్చి చూసినప్పుడు ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. చైనా మెడాగ్ ప్రాజెక్టుకు కౌంటర్ గా అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ నిర్మిస్తున్న దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనుంది. దిబాంగ్ ప్రాజెక్టు ఎత్తు 278 మీటర్లు. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్‌గా నిలవనుంది. మన పోలవరం ప్రాజెక్టు ఎత్తు సుమారు 40 మీటర్లు మాత్రమే. పోలవరంతో పోల్చితే దిబాంగ్ డ్యామ్ ఎత్తు దాదాపు 7 రెట్లు ఎక్కువ. దిబాంగ్ ప్రాజెక్టు విద్యుదుత్పత్తి సామర్థ్యం 2వేల 880 మెగావాట్లు. ఇది దేశంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కాబోతోంది. పోలవరం సామర్థ్యం 960 మెగావాట్లు మాత్రమే. దిబాంగ్ రిజర్వాయర్ సామర్థ్యం 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా పోలవరం సామర్థ్యం 5.5 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. 2021 అంచనాల ప్రకారం ఈ డ్యామ్ నిర్మాణానికి 32వేల కోట్లు ఖర్చవుతుంది. అయితే ఇప్పుడు ఈ అంచనాలు పెరిగి ఉండొచ్చు. 2032 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
దిబాంగ్ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి ముప్పును ఎదుర్కోవడమే కాదు.., దిగువ రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుంది. దిబాంగ్ ప్రాజెక్టు పూర్తయితే దిగువ రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుంది. బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాలు వరదల నుంచి బయటపడతాయి. అసోం నిత్యం వరదలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. దిబాంగ్ డ్యామ్ పూర్తయితే ఆ బాధ ఉండదు. పైగా చైనా నుంచి వచ్చే వరద ముప్పును అడ్డుకోగలుగుతుంది. అంతేకాక విద్యుదుత్పత్తి వల్ల అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర రాష్ట్రాలకు లబ్ది చేకూరుతుంది. అయితే ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దీంతో అక్కడి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం వీళ్లకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇన్నాళ్లూ చైనా డ్యామ్ వల్ల భారత్ కొంపకొల్లేరు అవుతుందనే భయం ఉండేది. అయితే మన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ద్వారా చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చిందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.
