Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!

Indian Ship

Indian Ship

Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఒక భారతీయ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో భారత్‌కు చెందిన ‘హాజీ అలీ’ అనే నౌకపై డ్రోన్ దాడి చోటుచేసుకుంది. ఈ డ్రోన్ దాడిలో ఆ నౌక తీవ్రంగా దెబ్బతిని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియలేదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. పలు నివేదికల ప్రకారం.. ఆ నౌకలో 14 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 14 మందిని రక్షించినట్లు ఒమన్ నావికాదళం ప్రకటించింది.

‘హాజీ అలీ’ (MSV HAJI ALI BDI 1492) అనే సరుకు రవాణా గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాకు చెందింది. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌక మునిగిపోవడం ఇది రెండవ సారి. అంతర్జాతీయ జలాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, గుజరాత్ నౌకా రవాణా పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేవలం వారం క్రితమే, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ – అమెరికా మధ్య జరిగిన కాల్పుల్లో గుజరాత్ నౌక ‘అల్ ఫైజ్ నూర్ సోలేమానీ-1’ మునిగిపోయింది.

‘హాజీ అలీ’ విషయానికి వస్తే.. మే 13న తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు, ఆ నౌక సోమాలియాలోని బెర్బెరా నుంచి షార్జాకు ప్రయాణిస్తోంది. అది ఒమన్‌లోని లిమా సమీపంలో వెళుతుండగా, ఒక డ్రోన్ శక్తివంతమైన పేలుడు పదార్థాలతో ఈ నౌకను పేల్చివేసింది. ఈ ప్రమాదంతో నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో ఓడ మునిగిపోవడం స్టార్ట్ అయ్యింది. ఓడ మునిగిపోవడాన్ని చూసిన 14 మంది సిబ్బంది, వెంటనే లైఫ్‌బోట్‌ల ద్వారా వారి ప్రాణాలను కాపాడుకున్నారు. వెంటనే ఒమన్ కోస్ట్ గార్డ్ స్పందించి భారతీయ నావికులందరినీ రక్షించింది. అనంతరం వారిని ఒమన్‌లోని దిబా పోర్టుకు తరలించారు. ‘హాజీ అలీ’ ఓడ యజమాని సుల్తాన్ అహ్మద్ సంఘర్, 14 మంది సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు. ఇప్పుడు ఒమన్ పోలీసులు ఈ నౌకపై ఎవరు దాడి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో రక్షించిన నావికులను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై నిన్న జరిగిన దాడి ఆమోదయోగ్యం కాదని, వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం భారత సిబ్బంది క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత సిబ్బందిని రక్షించినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఆమోదయోగ్యం కాదని భారత్ ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.