Mauritius: భారత ప్రధాని నరేంద్ర మోడీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూలం ఇటీవల వారణాసిలో ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలిసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు (బిజినెస్ కాంక్లేవ్)లో ఆ దేశ ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి మారిషస్ నాయకుడిని ఆహ్వానించడం తనకు గర్వకారణమని మోడీ అన్నారు. “శతాబ్దాలుగా కాశీ భారతదేశ నాగరికత, సంస్కృతికి ప్రతీకగా ఉంది. మన సంప్రదాయాలు, విలువలు శతాబ్దాల క్రితం మారిషస్‌కు చేరి.. అక్కడి జీవన విధానంలో లోతుగా పాతుకుపోయాయి. అందుకే నేను సగర్వంగా చెబుతున్నాను. భారత్ మరియు మారిషస్ కేవలం భాగస్వాములు కాదు ఒక కుటుంబం” అని మోడీ పునరుద్ఘాటించారు. అసలు మారిషస్ దేశానికి భారత్‌కి సంబంధం ఏంటి? మన దేశస్థులు అక్కడికి ఎందుకు వెళ్లారు. అనే విషయాలను తెలుసుకుందాం..
READ MORE: Upendra: ఆన్‌లైన్ డెలివరీ .. నా ఫోన్, మా ఆవిడ ఫోన్ హ్యాకయ్యాయ్
మారిషస్‌కు 1968లో బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది. అంతకు ముందు ఫ్రాన్స్ పాలనలో ఉండేది. 1739లో ఫ్రాన్స్ పాలకులు పాండిచ్చేరి, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చాలా మంది హస్త కళాకారులు, భవన నిర్మాణ కార్మికులను మారిషస్‌కు తీసుకెళ్లి వెట్టి చాకిరీ చేయించారు. బ్రిటీష్ పాలనలో వెట్టి చాకిరీని రద్దు చేశారు. దీంతో మారిషస్‌లోని వ్యాపారులు భారతీయులను ఒప్పంద కార్మికులుగా తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అలా 1834, నవంబర్ 2న 36 మంది ఒప్పంద కార్మికులతో ‘అట్లాస్’ అనే ఓడ మారిషస్‌కు చేరుకుంది. కార్మికులుగా వెళ్లిన భారతీయుల్లో సగానికిపైగా అక్కడే స్థిరపడిపోయారు. హిందూ మహా సముద్రంలో ఉన్న ఈ చిన్న దీవి ప్రస్తుత జనాభా 12.6లక్షలు. అందులో దాదాపు 70 శాతం మంది భారత సంతతి వ్యక్తులే ఉండటం విశేషం.
మారిషస్‌లో 1901లో మహాత్మ గాంధీ పర్యటించారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వస్తూ మధ్యలో మారిషస్‌లోని భారతీయులను కలిశారు. చదువు ప్రాముఖ్యత, రాజకీయ సాధికారత, భారత్‌తో అనుబంధం కొనసాగించాల్సిన ఆవశ్యకతలపై అవగాహన కల్పించారు. గాంధీ ప్రసంగాలు అక్కడి భారతీయుల్లో స్ఫూర్తినింపాయి. కార్మికులుగా వెళ్లిన వాళ్లు అక్కడే స్థిరపడి తమ ఉనికి చాటుకునేలా చేశాయి. ఆయన స్మారకంగా దండి మార్చ్ ప్రారంభించిన మార్చి 12నే మారిషస్ నేషనల్ డేగా జరుపుకొంటున్నారు. భారత్, మారిషస్ మధ్య 1948లో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.
READ MORE: CM Revanth Reddy :ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు చర్చలపై కీలక మలుపు
ఇరుదేశాల స్నేహబంధానికి ఆపరేషన్ లాల్ డోరా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 1983లో మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌కు ఒక సమస్య వచ్చి పడింది. అతని ప్రత్యర్థి, రాజకీయ నాయకుడు పాల్ బెరెంజర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జగన్నాథ్ భారత్‌కు వచ్చి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సాయం అడిగారు. మిత్రదేశం కోసం ఆమె ఆపరేషన్ లాల్ డోరా నిర్వహించారు. పాల్ బెరెంజర్ వ్యూహాలను చిత్తు చేసేందుకు భారత సైన్యాన్ని రహస్యంగా మారిషస్‌కు పంపించారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని భారత నిఘా సంస్థ ‘రా’ను ఆదేశించారు. మారిషస్‌లో భారత సంస్కృతిని కాపాడుకునేందుకు ఇరుదేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘ఇండియన్ కల్చరల్ సెంటర్’ను ఏర్పాటు చేశాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందీకి గుర్తింపు తెచ్చేందుకు ‘వరల్డ్ హిందీ సెక్రటరియెట్’ను, భారత సంస్కృతి, చరిత్ర, భాషలపై అధ్యయనం చేసేందుకు భారత సహకారంతో ‘మహాత్మ గాంధీ ఇన్‌స్టిట్యూట్’ను ఏర్పాటు చేశారు.
READ MORE: Telanagana : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రైవేట్ కాలేజీల బంద్, ఇబ్బందుల్లో విద్యార్థులు.
మారిషస్‌కు కష్టమొస్తే మొదట స్పందించేది మన దేశమే. పలు విపత్తుల్లో ఆపన్నహస్తం అందించింది. కొవిడ్ సమయంలో ఆ దేశానికి 13 టన్నుల ఔషధాలు, 10 టన్నుల ఆయుర్వేద మందులు పింపిణీ చేయడంతోపాటు ఇండియన్ ర్యాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీమ్‌ను అక్కడికి పంపించింది. అంతేకాదు, లక్షల వ్యాక్సిన్లను ఉచితంగా పంపించింది. మారిషస్ కూడా భారత్‌కు 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను విరాళంగా ఇచ్చింది. అంతేకాదు.. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. అంతే కాదు.. భారత్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా మారిషస్ ప్రభుత్వం 2004లో భారతీయుల కోసం వీసా-ఫ్రీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది. వీసా లేకుండా నెలరోజులపాటు ఆ దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తోంది. చివరిగా మరో ఆసక్తికర విషయం ఏంటంటే… మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూలం కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే. ఆయన కుటుంబం కూడా ఆ దేశానికి వెళ్లి స్థిరపడింది.
