In Sign Of Desperation For Rishi Sunak, Tory MPs Rush For Lifeboats: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. పన్నుల విషయంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. దేశంలో పన్నులు భారీగా ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా తగ్గించాలని పార్టీకి చెందిన 40 మంది టోరీ ఎంపీలు ఆదివారం ఆర్థికశాఖ మంత్రి జెరిమీ హంట్‌కు లేఖ రాశారు. ఒకవేళ పన్నులు తగ్గించకపోతే.. తిరుగుబాటు తప్పదని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ ప్రభుత్వం.. హౌసింగ్ టార్గెట్లు, పవన విద్యుత్తు సహా మరికొన్ని విధానపరమైన నిర్ణయాల్లో యూటర్న్ తీసుకుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే, వచ్చే సాధారణ ఎన్నికల్లో సునాక్ నేతృత్వంలోని కన్వర్వేటింగ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టోరీ ఎంపీలు సురక్షిత నియోజకవర్గాలు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే సంకేతాలు వస్తున్న తరుణంలో.. ఎంపీలు తమ ఓటు బ్యాంకుని కాపాడుకోవడం కోసం తమ స్థానాల్ని మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ చేస్తే.. ఓటమి తప్పదన్న ఒపీనియన్ పోల్స్ వెల్లడించడంతో.. వాళ్లు ఈ మేరకు నియోజకవర్గం మార్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా.. ప్రభుత్వం ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు, ఎంపీలు తమ పదవులు కాపాడుకోవడం కోసం ఇలా పెనుగులాటలు చేయడం, బ్రిటీష్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉంది. 1990లో జాన్ మేజర్ ప్రీమియర్షిప్ ముగిసినప్పుడు.. తమ సీట్ల కోసం ఎంపీలు పడే ఈ వెంపర్లాటను నాడు ప్రతిపక్షంలో ఉన్న టోనీ బ్లెయిర్ ‘చికెన్ రన్’గానూ, ఆ ఎంపీలను ‘చికెన్’గానూ అభివర్ణించారు.