Site icon NTV Telugu

Hong Kong: హాంగ్ కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం

Fire

Fire

హాంగ్ కాంగ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. 44 మంది సజీవదహనం కాగా.. దాదాపు 300 మంది ఆచూకీ గల్లంతైంది. ఒకేసారి ఏడు అపార్ట్‌మెంట్లలో మంటలు ఎగిసిపడ్డాయి.

హాంకాంగ్‌లోని తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫక్ కోర్టు రెసిడెన్షియల్ ఎస్టేట్‌లో అనేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో అనేక మంది ఊపిరాడక ప్రాణాలు పోయాయి. ఇప్పటి వరకు 44 మంది చనిపోగా.. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇక ప్రమాదానికి కారణంగా భావించిన ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వాంగ్ ఫక్ కోర్ట్ ఎస్టేట్‌లో అనేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఓ వైపు అపార్ట్‌మెంట్లు.. ఇంకోవైపు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కార్మికుల కోసం నిర్మించిన వెదురు స్కాఫోల్డింగ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే వెదురు కారణంగా వేగంగా మంటలు వ్యాపించేశాయి. మంటలు అంటుకోగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేశాయి. అంతేకాకుండా అగ్నికీలలు ఆకాశాన్నింటాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక ప్రమాదం తెలిసేలోపే ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం బాగా జరిగింది.

అగ్నిప్రమాదం జరగగానే వృద్ధులు పారిపోవడానికి ఇబ్బంది పడ్డారని.. సమాచారం తెలిసేలోపే ప్రమాదం జరిగిపోయిందని యుయెన్ అనే మహిళ తెలిపింది. నిర్మాణ పనులు కారణంగా చాలా మంది అపార్ట్‌మెంట్ నివాసితులు కిటికీలు మూసేసుకున్నారని పేర్కొంది. చాలా మందికి అగ్నిప్రమాదం జరిగిన విషయమే తెలియదని.. ఫోన్ కాల్స్ ద్వారా ఒకరి ఒకరు సమాచారం ఇచ్చుకున్నామని.. కానీ ఇంతలోనే జరగాల్సిన ముప్పు జరిగిపోయిందని వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం చాలా జరిగి ఉంటుందని.. అగ్నిమాపక సిబ్బంది కూడా చనిపోయి ఉంటారని యుయెన్ తెలిపింది.

 

 

Exit mobile version