Hamas: హమాస్‌కి మరోసారి భారీ ఎదురుదెబ్బ తాకింది. తాజాగా ఇజ్రాయిల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో హమాస్ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా మరణించాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సయేహ్ సిరాజ్, సమేహ్ ఔదేహ్ మరణించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గురువారం ధ్రువీకరించింది. ఐడీఎఫ్ తన ఎక్స్ పోస్టులో.. ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై దాడిలో రౌహి ముష్తాహా, ఇద్దరు కమాండర్లు మరణించినట్లు పేర్కొంది. అయితే, హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
Read Also: Israel-Iran War: ‘‘హిట్ లిస్ట్’’ రిలీజ్ చేసిన ఇరాన్..ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ..
ముగ్గురు కమాండర్లు ఉత్తర గాజాలోని భారీ కాపలా ఉన్న భూగర్భం సొరంగంలో దాక్కున్నారని, అక్కడ నుంచే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి సేవలు అందిస్తున్నారని మిలిటరీ తెలిపింది. ఈ దాడిని మూడు నెలల క్రితం నిర్వహించినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. రౌహి ముష్తాహా గాజాలో ప్రభుత్వాధినేతగా ఉన్నారు. సయేహ్ అల్ సిరాజ్ హమాస్ పొలిటికల్ బ్యూరోలో భద్రతా శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హమాస్ లేబర్ కమిటీ, హమాస్ జనరల్ సెక్యూరిటీ మెకానిజం కమాండర్‌గా సమీ ఔదేహ్ ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే హమాస్ పొలిటకల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని ఇరాన్ నడిబొడ్డున హత్య చేశారు. ఆ తర్వాత హమాస్‌కి కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వార్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి సిన్వార్ కోసం ఇజ్రాయిల్ గాలిస్తోంది. అయితే, ఇటీవల అతడి కదలికలు తగ్గడంతో సిన్వార్ కూడా మరణించాడనే నివేదికలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే అక్టోబర్ 07 నాటి దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సిన్వార్‌కి ముష్తాహా సన్నిహిత సహచరుడు.