Israel-Hamas War: 20 రోజుల నుంచి ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరు తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. ఇజ్రాయిల్ నుంచి 200కు పైగా ప్రజలను బందీలుగా హమాస్ ఉగ్రవాదులు గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజస్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. ఈ యుద్ధం మధ్యప్రాచ్యంతో పాటు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
Read Also: Salmonella Outbreak: అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి.. ఉల్లిపాయలే కారణం..
ఇదిలా ఉంటే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడుల్లో ఇప్పటివరకు బందీలుగా ఉన్న వారిలో 50 మంది ఇజ్రాయిలీలు చంపబడినట్లు హమాస్ సాయుధ విభాగం గురువారం వెల్లడించింది. అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ప్రకారం జియోనిస్ట్ దాడులు మరియు ఊచకోత ఫలితంగా గాజా స్ట్రిప్‌లో మరణించిన జియోనిస్ట్ ఖైదీల సంఖ్య దాదాపు 50కి చేరుకుందని అంచనా వేసినట్లు హమాస్ టెలిగ్రామ్ ఛానెల్ లో తెలిపింది.
ఇజ్రాయిల్ పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు గాజాలోని 6000కు పైగా ప్రజలు మరణించారు. ఇందులో పలువురు ఉగ్రవాదులతో పాటు సాధారణ ప్రజలు ఉన్నారు. ఇప్పటికే గాజాలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలను ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించింది. లేకపోతే హమాస్ ఉగ్రవాదులు ప్రజల్ని మానవ కవచాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. దీంతో గాజా వ్యాప్తంగా మానవతా సంక్షోభం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఏ క్షణానైనా ఇజ్రాయిల్ ఫోర్సెస్ భూతలదాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.