Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం

  • గ్రీస్‌లో ప్రమాదం
  • ఎఫ్-16 యుద్ధ విమానానికి మంటలు
  • అత్యవసర ల్యాండింగ్ అనంతరం ఘటన
Greece

Greece

గ్రీస్‌కు చెందిన హెలెనిక్ వైమానిక దళంకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిన కొద్ది క్షణాల్లోనే మంటల్లో చిక్కుకుంది. సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గ్రీస్‌లోని జకింతోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో రన్‌వేపై ఆగిన వెంటనే యుద్ధ విమానం నుంచి భారీ మంటలు, దట్టమైన నల్లపొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. సమాచారం అందుకున్న విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఫోమ్‌ను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వేగంగా స్పందించిన కారణంగా మంటలు మరింత వ్యాపించకుండా నిలువరించగలిగారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సింగిల్-సీట్ ఎఫ్-16 యుద్ధ విమానం హెలెనిక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 116వ ఫైటర్ వింగ్ స్థావరం అయిన అరాక్సోస్ (Araxos) నుంచి బయలుదేరి సైనిక విన్యాసాల్లో పాల్గొంటోంది. విమాన ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి జకింతోస్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే పైలట్ సమయానికి విమానం నుంచి బయటపడటంతో ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక గ్రీకు మీడియా కథనాల ప్రకారం ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. వైరల్ వీడియోల్లో కూడా పైలట్ విమానం నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనలో విమానాశ్రయ సిబ్బంది లేదా సాధారణ పౌరులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

ఈ ఘటన కారణంగా జకింతోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతసేపు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేను అత్యవసర సిబ్బంది భద్రపరిచి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం కార్యకలాపాలను పునరుద్ధరించారు. విమానానికి ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.

అత్యవసర పరిస్థితికి అసలు కారణమేంటనే విషయంపై హెలెనిక్ వైమానిక దళం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సాంకేతిక లోపం ఎలా తలెత్తిందనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. హెలెనిక్ వైమానిక దళంలో ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానాలు ప్రధాన బహుళ ప్రయోజన యుద్ధ విమానాలుగా సేవలందిస్తున్నాయి. యూరప్‌లోనే అతిపెద్ద ఎఫ్-16 విమాన దళాల్లో గ్రీస్ వైమానిక దళం ఒకటిగా గుర్తింపు పొందింది.