NTV Telugu Site icon

Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై ఐసీజే తీర్పు..రక్షించుకునే హక్కుందన్న నెతన్యాహు..

Icj

Icj

Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ICJ) ఆశ్రయించింది. తాజాగా గాజా యుద్ధంపై ఐసీజే తీర్పు చెప్పింది. గాజాలో నరమేధాన్ని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇజ్రాయిల్‌ని ఆదేశించింది. గాజాలో ఇజ్రాయిల్ మరణహోమం నిర్వహిస్తోందన్న దక్షిణాఫ్రికా వాదనల్లో కొన్ని ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని ఐసీజే అభిప్రాయపడింది. మానవతా సాయం, అత్యవసర సేవలను అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.

గాజాలో ప్రజలు చనిపోతున్నారని ఇజ్రాయిల్ మారణహోమానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై ఐసీజే ప్రెసిడెంట్ ఈ డినోగ్యూతో సహా 17 మంది న్యాయమూర్తుల బృందం విచారించింది. గాజాలో పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుని, ప్రాణనష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు, గాజాలోని పాలస్తీనియన్ల హక్కుల్ని గుర్తిస్తున్నామని, వారికి రక్షణ కల్పించే బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. గాజా యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయిల్‌కి ఆదేశాలు ఇవ్వాలని దక్షిణాఫ్రికా కోరింది. అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయిల్ ఖండించింది. ఈ కేసును కొట్టేయాలని వాదించింది.

Read Also: Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్‌లో 200 మంది పిల్లలు మృతి..

మరోవైపు అంతర్జాతీయ కోర్టు ఇజ్రాయిల్‌పై చేసిన ఆరోపణల్ని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘దౌర్జన్యం’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్‌కి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని చెబుతూనే.. తమను తాము రక్షించుకునే హక్కు ఉందని చెప్పారు.

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మంది హతమార్చగా.. పలువురిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకులపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 26,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో చాలా వరకు పిల్లలు ఉండటంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Show comments