France riots: అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా పారిస్ నగరంలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. నహెల్ అనే 17 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం అపకపోవడంతో, ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో దురదృష్టవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి ఆ దేశంలో వరసగా అల్లర్లు జరుగుతున్నాయి. ఇమన్యుయల్ మక్రాన్ ప్రభుత్వం అల్లర్లను అణిచివేయలేకపోతోంది.
ఇదిలా ఉంటే అల్లర్లలో ప్రజా ఆస్తులను, ప్రభుత్వ ఆస్తుల్ని ఆందోళనకారులు ధ్వంసం చేస్తుండటంతో స్థానికంగా ఉన్న ఫ్రెంచ్ ప్రజలు ఎదురుతిరగబడున్నారు. ఆందోళకారుల్ని అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో యువకుడిని కాల్చి చంపిన పోలీసులకు అక్కడి ప్రజలు మద్దతు నిలుస్తున్నారు. అతడిని, అతని కుటుంబ సభ్యుల్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తున్నారు. ప్రెంచ్ రైట్ వింగ్ రాజకీయవేత్త మెరైన్ లే పెన్ మాజీ సలహాదారు జీన్ మెస్సిహా ద్వారా ఈ నిధులను కలెక్ట్ చేసే ప్రోగ్రాం ప్రారంభమైంది. గో ఫండ్ మీ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే సదరు పోలీస్ అధికారికి మద్దతుగా ఏకంగా 1 మిలియన్ యూరోలు సేకరించారు.
Read Also: Vande Bharat trains: తగ్గనున్న వందేభారత్ ట్రైన్ ఛార్జీలు.. కొన్ని రూట్లను సమీక్షిస్తున్న రైల్వేశాఖ..
ఈ ఘటనలో చనిపోయిన యువకుడికి కోసం కలెక్ట్ చేసిన నిధుల కన్నా పోలీస్ అధికారికి ఐదు రెట్ల నిధులు వసూలయ్యాయి. ఈ విషయంపై ఫ్రెంచ్ మంత్రులు, ప్రభుత్వం ఏం మాట్లాడలేకపోతున్నారు. యువకుడి మరణం తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఏకంగా 1000కి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతివివక్ష కారణంగా యువకుడిని చంపేశారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. షాపులను లూటీ చేశారు. సిటీ హాల్స్, పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు. పారిస్ మేయర్ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.