Site icon NTV Telugu

SriLankan Crisis: ఆర్థిక సంక్షోభం తీవ్రం.. దుర్భర పరిస్థితులు..

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా శ్రీలంక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వంటగ్యాస్, నిత్యావసరాలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంధనం కోసం ఫిల్లింగ్‌ స్టేషన్‌ల వద్ద క్యూలైన్‌లో గంటలకొద్దీ నిల్చోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆందోళనకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. దీంతో శ్రీలంక సర్కారు పెట్రోలు బంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు తోడుగా సైనిక బలగాలను మోహరింపజేసింది. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగిశాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం లంకలో కిలో చికెన్‌ ధర వెయ్యి కాగా.. ఒక గుడ్డు ధర 35 రూపాయలు దాటిపోయింది. ఏదీ కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో లంకేయులు ఆకలితో అలమటించాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితుల్లో లంకలోని తమిళులు.. శరణార్థులుగా మారి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 మంది శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా తమిళనాడుకు చేరారని తెలుస్తోంది. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు.

Read Also: High Court: ప్రమాణం చేసిన 10 మంది కొత్త న్యాయమూర్తులు

కోవిడ్‌ వైరస్‌ విజృంభణ మొదలైనప్పటి నుంచి శ్రీలంకను కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా కారణంగా దేశానికి పర్యాటకుల రాక తగ్గింది. విదేశాల్లో పనిచేసే శ్రీలంక పౌరుల సంఖ్య కూడా క్రమేపీ తగ్గడంతో విదేశీ కరెన్సీ నిల్వలపై ప్రభావం పడింది. ద్రవ్యోల్బణంతో ప్రజల కొనుగోలు సామర్థ్యం చాలా తగ్గిపోయింది. ఇలా పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారడంతో లంక తమిళులు భారత్ వైపు మల్లుతున్నారు. తమిళ‌నాడు తీరం రామేశ్వరం, ధ‌నుష్కోటిల‌కు లంక త‌మిళులు వస్తున్నారు. ఇప్పటికే ఇలా వచ్చిన 16 మందిని కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. శ్రీలంక‌లో ఆర్థిక, ఆహార సంక్షోభం ఇలాగే కొన‌సాగితే.. మరింత మంది లంక తమిళులు.. భారత్‌కు శ‌ర‌ణార్థులుగా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Exit mobile version