Site icon NTV Telugu

Egypt Church Fire: ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది దుర్మరణం

Egypt Coptic Church Fire

Egypt Coptic Church Fire

Fire Accident At Egyptican Coptic Church 41 Members Died: ఈజిప్టు రాజధాని కైరోలోని అబు సిఫైనే చర్చిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం చెందగా.. 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటో ఇంకా స్పష్టంగా వెలుగులోకి రానప్పటికీ.. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్​కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మంటల్ని అదుపు చేసింది.

ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాప్టిక్ క్రిస్టియన్ చర్చి పోప్ తవాడ్రోస్-2కి ఫోన్ చేసి ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖల్ని ఆదేశించారు. కాగా.. ఈ చర్చి కాప్టిక్ ప్రజలకు చెందినది. మధ్యప్రాచ్యంలో ఈ కాప్టిక్ వర్గానికి అతిపెద్ద క్రైస్తవ సామాజికవర్గంగా పేరుంది. ఈజిప్టులో మొత్తం 10.3 కోట్ల జనాభా ఉండగా.. అందులో కోటి మందికి పైగా కాప్టిక్ క్రైస్తవులు ఉన్నారు. అయితే.. ఈజిప్ట్‌లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండటంతో, క్రిస్టియన్లను టార్గెట్ చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.

గతంలో వాళ్లు క్రైస్తవులకు సంబంధించిన ఇతర చర్చిలతో పాటు పాఠశాలలు, ఇళ్లను తగలబెట్టినట్టు కథనాలున్నాయి. ఇక ఈజిప్ట్ ప్రెసిడెంట్ సిసి ఇటీవలే రాజ్యాంగ న్యాయస్థానానికి నాయకత్వం వహించడానికి కాప్టిక్ న్యాయమూర్తిని నియమించిన తర్వాత.. చాలా ప్రాంతాల్లో అల్లర్లు కూడా జరిగాయి. ఓ కాప్టిక్ న్యాయమూర్తిని నియమించడం.. ఈజిప్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరిణామాల క్రమంలోనే అబూ సెఫైన్ చర్చిలో మంటలు చెలరేగడంతో.. ఈ ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version