Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్‌ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్‌ఎక్స్!

  • వార్ జోన్‌లో మస్క్ మైండ్ గేమ్..
  • ఇరాన్ యుద్ధంలో ఇంటర్నెట్ బిల్లు ఏకంగా 5 రెట్లు పెంపు..
  • ఒక్కో అమెరికా డ్రోన్ ఖర్చు రెట్టింపు
Spacex Sparks

Spacex Sparks

Elon Musk:ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధంలో తలమునకలై ఉండగా.. మరోవైపు ఆ దేశ రక్షణ శాఖ (పెంటగాన్) ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. యుద్ధ ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల ధరలను మస్క్ సంస్థ ఏకంగా ఐదు రెట్లు పెంచేయడమే ఈ వివాదానికి కారణం. వ్యూహాత్మక రక్షణ సమయాల్లో మస్క్ ఈ రేంజ్‌లో బ్లాక్‌మెయిల్ ధోరణి ప్రదర్శించడంపై పెంటగాన్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్ యుద్ధంలో అమెరికా సేనలు ఉపయోగిస్తున్న అత్యంత ఆధునిక ‘లూకాస్ కామికాజీ ఆత్మాహుతి డ్రోన్లు’ పురోగతి సాధించడంలో మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ ఉపగ్రహ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా బాంబు దాడులు ప్రారంభించిన కొద్ది వారాలకే స్పేస్‌ఎక్స్ అధికారులు పెంటగాన్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సైన్యం వాడుతున్న ఒక్కో టెర్మినల్ కనెక్షన్‌కు $5,000 చెల్లిస్తోందని, కానీ అవి పొందుతున్న హై-లెవెల్ సేవలకు కనీసం $25,000 (సుమారు రూ.21 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డ్రోన్లు కేవలం నిమిషాలు లేదా గంటల పాటే కనెక్ట్ అయినప్పటికీ, అవి అత్యంత ఖరీదైన ‘ఏవియేషన్ టైర్’ (విమాన సర్వీసుల) కేటగిరీ కిందకు వస్తాయని స్పేస్‌ఎక్స్ వాదించింది. ఇరాన్‌పై దాడులు ముమ్మరంగా సాగుతున్న క్లిష్ట సమయంలో అమెరికాకు మరో దారి లేకపోయింది. చివరికి మస్క్ పెంచిన రేట్లకు పెంటగాన్ అంగీకరించాల్సి వచ్చింది. దీనివల్ల గతంలో $30,000 ఉన్న ఒక్కో లూకాస్ డ్రోన్ నిర్వహణ ఖర్చు ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది.

మిలిటరీ వెర్షన్ ‘స్టార్‌షీల్డ్’తో ఆటలు
సాధారణ ప్రజలకు మార్కెట్లో దొరికే స్టార్‌లింక్ టెర్మినల్స్ కాకుండా.. అమెరికా రక్షణ శాఖ కోసం స్పేస్‌ఎక్స్ 2023లో ‘స్టార్‌షీల్డ్’ (Starshield) అనే ఒక ప్రత్యేక సైనిక వెర్షన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ధ రంగంలో సమాచార మార్పిడికి, మారుమూల ప్రాంతాల్లో లక్ష్యాలను కచ్చితంగా చేధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న మొత్తం ఉపగ్రహాలలో 60 శాతానికి పైగా (దాదాపు 10,000 ఉపగ్రహాలు) మస్క్ సంస్థవే కావడం విశేషం. 2022 ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా మస్క్ కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలను నిలిపివేసి ఉక్రెయిన్ ఎదురుదాడిని దెబ్బతీశారు. తాజాగా అమెరికా నేవీ పరీక్షల సమయంలోనూ గ్లోబల్ అవుటేజ్ వల్ల సైనిక బోట్లు సముద్రంలో చిక్కుకుపోయాయి. ఒక ప్రైవేట్ సంస్థపై రక్షణ రంగం ఇంతలా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనలు నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసి నిరసనకారులను అణచివేస్తున్న తరుణంలో.. అక్కడి పౌరుల మొబైల్ ఫోన్లకు నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్ అందించేలా “డైరెక్ట్-టు-సెల్” (5G లాంటి) సేవలను ప్రారంభించాలని అమెరికా భావించింది. దీనికోసం భూమిపై ఎటువంటి టెర్మినల్స్ అవసరం లేదు. కానీ, ఈ సేవలను యాక్టివేట్ చేయడానికి స్పేస్‌ఎక్స్ ఏకంగా $500 మిలియన్లు (రూ. 4,100 కోట్లకు పైగా) అడ్వాన్స్ అడిగింది. అంతేకాకుండా దీని నెలవారీ నిర్వహణ ఖర్చు కింద మరో $100 మిలియన్లు డిమాండ్ చేసింది. ఈ అక్షరాల అంకెలు చూసి రక్షణ శాఖ అధికారులు బిత్తరపోయారు. మస్క్ మోపుతున్న ఈ ఆర్థిక భారాన్ని భరించలేక పెంటగాన్‌కు చెందిన ‘కమర్షియల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్’ అమెజాన్ ప్రైమ్ లియో, వన్‌వెబ్ వంటి ఇతర సంస్థల వైపు చూస్తోంది. అయితే ప్రస్తుతం స్టార్‌లింక్ రేంజ్ కవరేజ్ ఏ సంస్థకూ లేకపోవడం అమెరికాకు పెద్ద మైనస్‌గా మారింది.

ధరల వివాదం ఇంతలా ముదురుతున్నప్పటికీ, రాయిటర్స్ నివేదిక ప్రకారం.. పెంటగాన్ మరికొద్ది రోజుల్లో అదనంగా మరో 3,500 స్టార్‌షీల్డ్ టెర్మినల్ సబ్‌స్క్రిప్షన్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోందట. దీనివల్ల స్పేస్‌ఎక్స్ ఖాతాలోకి ఏటా వందల బిలియన్ డాలర్ల ప్రభుత్వ సొమ్ము చేరనుంది. ఒక అగ్రరాజ్య రక్షణ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని ఎలాన్ మస్క్ ఆడిస్తున్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.