Electric Comb: బట్టతల అనేది మగాళ్లలో తీవ్ర సమస్యంగా మారుతోంది. మూడు పదులు రాకముందే జుట్టు ఊడిపోతోంది. నెత్తిపై జుట్టు కోసం లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఫలితాలు సరిగా రావడంలేదు. ఇలాంటి సమయంలో బట్టతల బాధితుల కోసం చైనా గుడ్ న్యూస్ చెప్పింది. జుట్టు రాలడం, బట్టతల సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించే సరికొత్త సాంకేతికతను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘డిటాంగిల్’ (Detangle) పేరుతో రూపొందించిన ఎలక్ట్రిక్ దువ్వెన చిన్నపాటి విద్యుత్ ప్రేరణల ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా పనిచేస్తుంది. ఎలుకల్లో జరిగిన పరిశోధనల్లో కేవలం 28 రోజుల్లోనే కొత్త వెంట్రుకలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జట్టు పలుచబడిన ప్రాంతంలో కొత్త జుట్టు రావడాన్ని గమనించారు.
చైనా రాజధాని బీజింగ్ లోని బెహాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఎలా పనిచేస్తుంది.?
డిటాంగిల్ ఎలక్ట్రిక్ దువ్వెన తల చర్మానికి చిన్నపాటి ఎలక్ట్రిక్ పల్స్లను అందిస్తుంది. ఈ విద్యుత్ ప్రేరణలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరించి, జుట్టు పెరుగుదలకు సహాయపడేలా రూపొందించారు. విద్యుత్ ప్రేరణలు, తేలికపాటి విద్యుత్ సంకేతాల ద్వారా తల చర్మంలోని రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు కేశ కుదుళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ దువ్వెన మారిదిగానే రోజూ వారీ ఉపయోగానికి అనువుగా దీనిని రూపొందించారు. సాంప్రదాయక చికిత్సలతో పోలిస్తే ఈ పరికరం తల చర్మంలోకి 9 రెట్లు ప్రభావం చూపగలదని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. అయితే, పురుషుల్లో సాధారణంగా కనిపించే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (Androgenetic Alopecia) చికిత్సలో భవిష్యత్తులో ఇది ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనుషులపై ప్రయోగాలు ఇంకా జరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా బట్టతల సమస్య..
ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అనేది జన్యుపరమైన, హార్మోన్ల ప్రభావానికి సంబంధించింది. దీని వల్లే మగాళ్లలో బట్టతల సమస్య వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. జుట్టు రాలిపోవడం శారీరక రూపానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం, జీవన నాణ్యతపైనా ప్రభావం చూపుతోంది.

