NTV Telugu Site icon

సుఖాంతం కాని ఎవర్ గివెన్ నౌక కథ.. భారీ నష్టపరిహారం చెల్లిస్తే కానీ వదలరా ?

ఎవర్ గివెన్ నౌక  కథ సుఖాంతం కాలేదా ? సూయజ్ నుంచి నౌకను కదిలించినా..యజమానులను వచ్చిన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవా ? నౌక అక్కడి నుంచి కదలకుండా ఈజిప్ట్ కొర్రీలు పెడుతోందా ?  ప్రస్తుతం ఎవర్ గివెన్ నౌక పరిస్థితేంటి ? అసలు విషయానికి వెళ్తే ఎవర్ గివెన్‌ నౌకకు కొత్త కష్టాలు వచ్చాయి. అయితే ఈ సారి సూయజ్ కాలువ నుంచి కాదు.. ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి. అక్కడి నుంచి  నౌక కదలాలంటే.. వందల కోట్ల జరిమానా కట్టాలని ఈజిప్ట్  స్పష్టం చేసింది. ప్రస్తుతం దాన్ని గ్రేట్ బిట్టెర్ లేక్‌లో లంగరు వేసి ఉంచింది. ఎవర్ గివెన్ నౌక.. సూయజ్‌ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించే వరకు దానిని వదిలేది లేదని తేల్చి చెప్పింది. నౌక ఇరుక్కోవడం పై విచారణ పూర్తై, నష్టపరిహారం చెల్లించే వరకు అది ఇక్కడే ఉంటుందని సూయజ్ కెనాల్ అథారిటీ  చెప్పింది. 

సూయజ్ కాలువ లో ఎవర్ గివెన్ నౌక  మళ్లీ కదలగానే కథ సుఖాంతమైందని అందరూ భావించారు. కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య జల మార్గాల్లో ఒకటైన సూయజ్ కాలువ నుంచి నౌకను మార్చి చివరిలో విజయవంతంగా కదిలించారు. అయితే ఆ నౌక యజమానులను వచ్చిన కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కాలువలో రాకపోకలు ఆగడం వల్ల నష్టపోయిన రుసుములు, నౌకను మళ్లీ తేలేలా చేయడానికి జరిగిన తవ్వకాల వల్ల కాలువకు జరిగిన నష్టం, ఆ పనులు చేసిన మెషిన్లు, పరికరాలకు అయిన ఖర్చు అన్నింటికీ ఈజిప్ట్ లెక్కలు వేసింది. నౌక వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించే వరకు దానిని వదిలేది లేదని ఈజిప్ట్ చెబుతోంది. 

వాళ్లు పరిహారానికి ఒప్పుకున్న మరుక్షణమే ఆ నౌక  కదలడానికి అనుమతిస్తామని చెబుతోంది. అయితే పరిహారం చెల్లించాలని తమకు ఎలాంటి అధికారిక క్లెయిమ్ లేదా లీగల్ డిమాండ్ రాలేదని ఎవర్ గివెన్ నౌక యజమాని, జపాన్‌కు చెందిన షోయీ కిసెన్ సంస్థ చెప్పింది. కానీ జరిగిన నష్టాన్ని తాము గుర్తించామని, కాలువ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. సూయజ్ కాలువలో సముద్రాల ద్వారా జరిగే మొత్తం వాణిజ్యంలో 12 శాతం జరుగుతుంది. 

ప్రతి రోజూ దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు, దాదాపు 8శాతం ఎల్పీజీ రవాణా అవుతుంది. అయితే ఎవర్ గివెన్ చిక్కుకు పోవడం వల్ల ఆ ఉత్పత్తుల ధరల పై తీవ్ర ప్రభావం పడింది. దీనికితోడు ఎవర్ గివెన్ కాలువలో ఉన్నప్పుడు అటూ ఇటూ 360 కి పైగా నౌకలు నిలిచిపోయాయని ఒక అంచనా. వాటిలో సరకు రవాణా నౌకలు, చమురు, నేచురల్ గ్యాస్ ట్యాంకర్లు ఉన్నాయి.  దీంతో ఈ మార్గం పై తీవ్ర ప్రభావం పడింది. కాలువకు ప్రతిరోజూ 15 మిలియన్ డాలర్ల నష్టం తెచ్చిపెట్టిందని ఈజిప్ట్ చెబుతోంది. ఈ నౌకకు వచ్చిన కొత్త కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి మరి.