NTV Telugu Site icon

Earthquake: వనౌటు ద్వీపాన్ని వణికించిన భారీ భూకంపం.. పలు ఎంబసీ కార్యాలయాలు ధ్వంసం

Earthquake

Earthquake

పసిఫిక్ ద్వీపమైన వనౌటును భారీ భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించిపోయాయి. భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటులో మంగళవారం దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలా నుంచి పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో పలుమార్లు ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే పలుచోట్ల వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాజధాని పోర్ట్ విలాలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

యూఎస్, యూకే, ఫ్రెంచ్ రాయబార కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:47 గంటలకు ప్రధాన ద్వీపం ఎఫేట్ తీరానికి దాదాపు 30 కిమీ దూరంలో 57 కిమీ లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలిపింది. ఇక భూకంప దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

భూప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భారీ కుదుపులతో జనాలు హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు పరుగులు తీశారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎంత మంది చనిపోయారో.. ఎంత ఆస్తి నష్టం జరిగిందో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.