Site icon NTV Telugu

China President Xi Jinping: జిన్‌పింగ్ సంచ‌ల‌న నిర్ణయం… అణ్వాయుధ ద‌ళ టాప్ అధికారుల తొలగింపు

Xi Jinping

Xi Jinping

China President Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో అణ్వాయుధ ద‌ళాలకు చెందిన ఇద్దరు టాప్ అధికారులను పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తుల్ని నియ‌మించారు. అవినీతి నిర్మూల‌నే ధ్యేయంగా ఆయ‌న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ద‌శాబ్ధ కాలం త‌ర్వాత చైనా మిలిట‌రీలో భారీ స్థాయిలో మార్పు జ‌రిగింది. పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ యూనిట్ అధిప‌తి జ‌న‌ర‌ల్ లీ యుచేవ్‌ను తొల‌గిస్తూ జీ జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. యుచేవ్‌తో పాటు ఆయ‌న డిప్యూటీపై కూడా వేటు వేశారు. న్యూక్లియ‌ర్ ఫోర్స్ కోసం మాజీ నేవీ చీఫ్ వాంగ్ హౌబిన్‌, పార్టీ సెంట్రల్ క‌మిటీ స‌భ్యుడు జూ జిషెంగ్‌ల‌ను నియ‌మిస్తూ అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు.

Read also: Venu Yeldandi: వెకేషన్ సరే.. నెక్స్ట్ సినిమా ఎప్పుడు.. ?

ఈ నిర్ణయం గ‌త ద‌శాబ్ధ కాలంలో చైనా మిలిట‌రీలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు అని విశ్లేష‌కులు చెబుతున్నారు. న్యూక్లియ‌ర్ స్ట్రాట‌జీలో చైనా త‌న విధానాన్ని మార్చుకున్నద‌ని, అందుకే ఆ ద‌ళానికి చెందిన టాప్ నేత‌ల్ని మార్చివేసిన‌ట్లు తెలుస్తోందన్నారు. పీఎల్ఏను అసాధార‌ణ రీతిలో జిన్‌పింగ్ నియంత్రిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కానీ టాప్ ర్యాంకుల్లో ఉన్న నేత‌లు అవినీతికి పాల్పడుతున్నార‌ని, దాని ప‌ట్ల జిన్‌పింగ్ ఆందోళ‌న చెందుతున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఆస్ట్రియా రాజ‌ధాని వియన్నాలో జ‌రిగిన ఎన్పీటీ స‌మావేశంలో చైనా పాల్గొన్నది. అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు క‌లిగిన దేశాలు త‌మ బాధ్యత‌ల్ని గుర్తుంచుకోవాల‌ని, నిరాయుధీక‌ర‌ణ‌లో భాగంగా కొత్త ఒప్పందాన్ని అమ‌లు చేయాల‌ని చైనా పేర్కొన్నది. ఆ స‌మావేశాల్లో చైనా విదేశాంగ శాఖ‌కు చెందిన ఆర్మ్స్ కంట్రోల్ శాఖ డైరెక్టర్ జ‌న‌ర‌ల్‌ సున్ జియాబో మాట్లాడారు. అణు నిరాయుధీక‌ర‌ణ ప్రక్రియ‌లో న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ దేశాలు చేరే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Exit mobile version