కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో చైనాలోని అతి పెద్ద నగరమైన షాంఘై సిటీలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. కరోనా కేసులు కట్టడికి చైనా యంత్రాంగం కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేసింది. కరోనా సోకిన ప్రదేశాలలో ముళ్ల కంచెవేసి, ఆ ప్రాంతం నుంచి ఎవ్వరినీ బయటకు రాకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా షాంఘై సిటీలో లాక్‌డౌన్ నిబంధనలతో ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు కూడా. అయితే.. ఇటీవల నుంచి కొద్దికొద్దిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో చైనా అధికారులు లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే షాంఘై సిటీలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే నెల జూన్ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరువారాలుగా షాంఘై సిటీలో కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. వైరస్ నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలతో కేసులు తగ్గుతున్నట్లు, మరో వైపు ఇప్పటికే పలు ఆంక్షలను సడలించినట్లు డిప్యూటీ మేయర్ జోంగ్ మింగ్ వెల్లడించారు. జూన్ 1 నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. కేసులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
