NTV Telugu Site icon

Hezbollah: ఆ బాధ్యతలు తీసుకుంటే ఇజ్రాయిల్ చేతిలో చావే.. హిజ్బుల్లా చీఫ్ పదవిని చేపట్టేందుకు భయం..

Hezbollah

Hezbollah

Hezbollah: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కకావిలకం అవుతోంది. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో బీరూట్ దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లను వెతికి వెంటాడి చంపేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లాని బీరూట్ దాడిలో ఇజ్రాయిల్ చంపేసింది. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన హషీమ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయిల్ దాడిలో మరణించాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే కీలకమైన నేతల్ని మట్టుపెట్టింది. దీనికి ముందు కీలకమైన హిజ్బుల్లా కమాండర్లను ఇజ్రాయిల్ హతం చేసింది.

Read Also: Mahila Bank: ఈ బ్యాంకులో అందరు మహిళా ఉద్యోగులే.. మహిళలకు మాత్రమే రుణాలు

అయితే, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టినా చంపేస్తాం అని ఇజ్రాయిల్ పరోక్షంగా దాడులతో సమాధానం ఇస్తోంది. బాధ్యతలు తీసుకునేందుకు ఇప్పుడు హిజ్బుల్లా నేతలు వణుకుతున్నట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా పొలిటికల్ కౌన్సిల్ చీఫ్ ఇబ్రహీం అమీన్ అల్-సయ్యద్ తదుపరి బాధ్యతలు తీసుకుంటానే సమాచారం వినిపిస్తోంది. హషీమ్ సఫిద్దీన్ మరణం తర్వాత ఇతడి పేరు వచ్చింది. అయితే, ఈ బాధ్యతల్ని తీసుకునేందుకు అతను ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.

అయితే, హిజ్బుల్లా మాత్రం ఇప్పుడు నస్రల్లా వారసుడిగా ఎవరిని నామినేట్ చేయలేదని చెబుతోంది. ‘‘సమిష్టి నాయకత్వం’’లో హిజ్బుల్లా, ఇజ్రాయిల్‌పై పోరాడుతోందని చెబుతున్నారు. హిజ్బుల్లాను విమర్శించే అలీ అల్ అమిన్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కొత్త సెక్రటరీ జనరల్‌గా ఎవరూ బాధ్యతలు తీసుకున్నా.. నస్రల్లా, సఫీద్దీన్‌కి పట్టిన గతే వారికి పడుతుందని అన్నారు. ‘‘ఏ అభ్యర్థి అయినా కూడా వారు మరణానికి అభ్యర్థి’’ అని చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ దాడులతో హిజ్బుల్లా అయోమయంలో ఉంది. పార్టీ డిప్యూటీ లీడర్ తన పాత్రను బట్టి నయీమ్ ఖాస్సెం తాత్కాలిక సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.