Site icon NTV Telugu

Flying Cars: ఎగిరే కార్లు వస్తున్నాయి.. విజయవంతంగా పరీక్షించిన చైనా..

Flying Cars

Flying Cars

China Tests “Flying” Cars: గత కొన్నేళ్లుగా వాహనరంగంలో వివిధ మార్పులు వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎగిరే కార్లు మాత్రం చాలా కాలంగా కలగానే ఉన్నాయి. ఎగిరే కార్లను తయారు చేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భవిష్యత్తుల ఎగిరే కార్లు తప్పకుండా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా చైనా చేసిన ఓ ప్రయోగం ఎగిరే కార్లు ఇంకెంతో దూరంలో లేవని చెబుతోంది. సిచువాన్ ప్రావిన్సులోని చెంగ్డులోని సౌత్ వెస్ట్ జియాటాంగ్ యూనివర్సిటీకి చెందిన చైనీస్ పరిశోధకులు గతవారం ఎగిరే కారును తయారు చేసి పరీక్షించారు. అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కండక్టర్ రైల్ పై కారు ఎగురుతూ ప్రయాణం చేసింది.

ఒక విధంగా చెప్పాలంటే హైస్పీడ్ రైళ్లలో ఉపయోగించే టెక్నాలజీనే ఈ కార్లలో కూడా ఉపయోగించారు. మాగ్నెటివ్ లెవిటేషన్(మాగ్లెవ్) సాంకేతికను ఈ కార్లలో ఉపయోగించారు. మొత్తం ఎనిమిది సెడాన్ కార్లను పరీక్షించారు. బలమైన అయస్కాంతాలను కార్ల దిగువన అమర్చి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ట్రాక్ పై ఎగురుతూ పరుగులు తీసింది కారు. మొత్తం 8 కార్లను పరిశీలిస్తే ఓ కారు అనూహ్యంగా 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. 2.8 టన్నులు ఉన్న కారు నేలకు 35 మిల్లీమీటర్ల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించింది.

READ ALSO: Auto Driver: ఆటో డ్రైవర్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.25 కోట్లు సొంతం

చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హూవా ప్రకారం ప్యాసింజర్ కార్లకు మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ జోడించడం వల్ల తక్కువ శక్తి.. ఎక్కవ పరిధిని పొందవచ్చని తెలిపింది. 1980ల నుంచి కొన్ని హైస్పీడ్ బుల్లెట్ రైళ్లలో మాగ్లెవ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుని ట్రాక్ నుంచి కొద్ది ఎత్తులో ప్రయాణిస్తుంటాయి ఈ మాగ్లెవ్ రైళ్లు. ట్రాక్, వీల్స్ కు మధ్య ఘర్షణ లేకపోవడంతో అత్యంత వేగంతో దూసుకెళ్తుంటాయి. ప్రస్తుతం దక్షిణ కొరియా, చైనా, జపాన్ దేశాల్లో మాగ్లెవ్ ట్రైన్లు ఉన్నాయి. గతేడాది చైనా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును ఆవిష్కరించింది.

Exit mobile version