China vs US: మరోసారి అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధానికి తెరలేసినట్టు అయ్యింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో అమెరికా, డ్రాగన్ మధ్య వార్నింగ్‌ల పర్వం కొనసాగగా… ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI)పై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది చైనా.. ఏఐ.. ఏ ఒక్క అగ్రరాజ్యానికీ గుత్తాధిపత్యం కాదని చైనా అధికారిక వార్తాపత్రిక పీపుల్స్ డైలీ పేర్కొంది. AI వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవడంతో పాటు, వివక్ష లేని అభివృద్ధి వాతావరణం కోసం అమెరికా చైనాతో కలిసి పనిచేయాలని సూచించింది. వచ్చే వారం జరగనున్న అమెరికా-చైనా ఉన్నతస్థాయి చర్చల్లో AI విధానం కీలక అంశంగా ఉండనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి..
అమెరికా, చైనా ప్రస్తుతం అత్యాధునిక AI సాంకేతికత అభివృద్ధి, వినియోగంలో ప్రధాన శక్తులుగా ఉన్నాయి. అయితే AI విధానాలు, పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం చైనా అమెరికన్ AI ల్యాబ్‌ల మేధో సంపత్తిని భారీ స్థాయిలో దొంగిలించిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పీపుల్స్ డైలీ ‘జోంగ్ షెంగ్’ అనే కలం పేరుతో వ్యాఖ్యానం ప్రచురించింది. ఈ పేరును చైనా కమ్యూనిస్ట్ పార్టీ విదేశాంగ విధానంపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి తరచుగా ఉపయోగిస్తుంది. AI మానవ అభివృద్ధికి సంబంధించిన కొత్త రంగమని, దానిని దేశాల మధ్య గెలుపు-ఓటముల పోటీగా మార్చకూడదని పేర్కొంది.
చైనా ఓపెన్ సోర్స్, ఓపెన్ ప్రాక్టీసెస్‌ను ప్రోత్సహిస్తోందని పీపుల్స్ డైలీ తెలిపింది. అమెరికా కంపెనీలతో సహా ప్రపంచంలోని సంస్థలు చైనా ఓపెన్ సోర్స్ AI మోడళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంది. AI అభివృద్ధి మరింత ఓపెన్‌గా, సమగ్రంగా, అందరికీ ప్రయోజనకరంగా ఉండేందుకు అమెరికాతో నిర్మాణాత్మక, వృత్తిపరమైన చర్చలకు చైనా సిద్ధంగా ఉందని తెలిపింది. అదే సమయంలో, AI మోడళ్లను చిన్న మోడళ్ల శిక్షణ కోసం ఉపయోగించే ‘డిస్టిలేషన్’ విధానంపై కూడా పీపుల్స్ డైలీ అమెరికాపై విమర్శలు చేసింది. అమెరికా సంస్థలు ఈ విధానాన్ని ఉపయోగిస్తే పరిశ్రమలో సాధారణ పద్ధతిగా చూస్తున్నారని, చైనా సంస్థలు ఉపయోగిస్తే దాడిగా పరిగణిస్తున్నారని పత్రిక ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు చైనా వైఖరిని ప్రతిబింబిస్తాయని, అమెరికా మాత్రం చైనా సంస్థలపై మేధో సంపత్తి దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు చేస్తోందని Reuters నివేదించింది. అయితే, చైనా స్పందనపై ఇప్పుడు ట్రంప్ ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది..

