China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి

  • చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం
  • బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
  • 201 మందిని సురక్షితంగా బయటకు
China

China

చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడులో కనీసం 80 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇంకా పలువురు భూగర్భంలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించిన సమయంలో గనిలో మొత్తం 247 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాత్రంతా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో శనివారం తెల్లవారుజాము నాటికి 201 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ లేదా భూగర్భ ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా అధికారులు తెలిపారు.

షీ జిన్‌పింగ్ స్పందన

ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు Xi Jinping తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన కార్మికులను రక్షించేందుకు అన్ని వనరులను వినియోగించాలని, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జిన్హువా నివేదించింది.

చైనాలో బొగ్గు గనుల ప్రాధాన్యం

షాన్సీ ప్రావిన్స్ చైనాలో ప్రధాన బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఈ ప్రావిన్స్‌లోనే 1.3 బిలియన్ టన్నుల బొగ్గు తవ్వినట్లు సమాచారం. ఇది చైనా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో దాదాపు మూడవ వంతు.

అయితే భద్రతా లోపాలు, ప్రమాదకరమైన పనివాతావరణం కారణంగా చైనాలో గని ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటన మరోసారి గని కార్మికుల భద్రతపై ఆందోళనలు పెంచింది.