Site icon NTV Telugu

Shanghai Corona: కరోనాతో టెన్షన్.. రంగంలోకి ఆర్మీ, డాక్టర్లు

Shangai

Shangai

కరోనాకు పుట్టినిల్లయిన చైనా ఇప్పుడు మళ్ళీ కరోనా టెన్షన్ తో అతలాకుతలం అవుతోంది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. చైనాలో సోమవారం 13 వేలకు పైగా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. షాంఘైలోనో 70 శాతం కేసులు వెలుగులోకి రావడంతో చైనా అప్రమత్తం అయింది. కేసుల నివారణకు 2 వేల మంది సైన్యం, 15 వేలమంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికి రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

షాంఘైలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో మొత్తం 13 వేల కేసులు వస్తే.. 9 వేల కేసులు ఒక్క షాంఘైలోనే వెలుగు చూశాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా షాంఘైలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయినా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండడం అధికారులను కలవరపెడుతోంది. ఏం చేయాలో తెలీక వారు తర్జన భర్జన పడుతున్నారు. ప్రజలు అత్యవసర సేవలకు మినహా బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేస్తూనే వున్నారు. చివరాఖరిగా ప్రభుత్వం సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. ఆర్మీ, నేవీకి చెందిన దాదాపు 2 వేలమందితోపాటు 15 వేలమంది ఆరోగ్యకార్యకర్తలు, వైద్యులను షాంఘై పంపింది. ఈ నగరానికి పొరుగున ఉన్న జియాంగ్జు, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల నుంచి కూడా సిబ్బందిని షాంఘై తరలిస్తున్నారు.

షాంఘై పౌరులు టెస్ట్ లు చేయించుకోవాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. దీంతో యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు జనం. షాంఘైలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. నగరానికి బయటి నుంచి వచ్చేవారు, నగరం నుంచి బయటకు వెళ్ళేవారిపై ఆంక్షలు అమలులో వున్నాయి. అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఫలితంగా ఆయా సంస్థల సిబ్బంది బయటకు రాకుండా కార్యాలయాల్లోనే ఉంటూ బయటకు రాకుండా పనిచేస్తూ అక్కడే తిండి, నిద్ర కానిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. వర్క్ ఫ్రం హోం చేస్తామన్నా కుటుంబసభ్యుల ఆరోగ్యం దృష్ట్యా వారిని కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు.

 

Exit mobile version