ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నీటిలో మునిగిపోతున్న వారిని రక్షించే వినూత్న టెక్నాలజీని చైనా పరీక్షించింది. ‘ఫ్లయింగ్ లైఫ్‌బాయ్’ గా పిలుస్తున్న ఈ ఏఐ ఆధారిత రెస్క్యూ రోబోట్.. ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి దగ్గరకు నేరుగా ఎగురుకుంటూ వెళ్లి, అతడు తేలేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే బాధితుడికి ప్రాథమిక రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో నిర్వహించిన వాటర్ రెస్క్యూ డ్రిల్‌లో ఈ సాంకేతికతను ప్రదర్శించారు. ఈ డ్రిల్‌లో ఫ్లయింగ్ లైఫ్‌బాయ్‌తో పాటు డ్రోన్లు, మానవరహిత రెస్క్యూ బోట్‌ను కూడా ఉపయోగించారు.
ఎలా పనిచేస్తుంది?
సీజీటీఎన్ నివేదిక ప్రకారం.. ఏఐ ఆధారిత ఈ పరికరం నీటిలో ప్రమాదంలో ఉన్న వ్యక్తి దగ్గరకు స్వయంచాలకంగా ఎగురుకుంటూ వెళ్తుంది. నీటిని తాకిన వెంటనే దాని రోటర్లు ఆగిపోతాయి. అనంతరం బాధితుడు దానిని పట్టుకున్నా లేదా దానిపైకి ఎక్కినా పరికరం నీటిపై స్థిరంగా తేలుతూ ఉంటుంది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునే వరకు బాధితుడికి తేలేందుకు ఇది సహాయపడుతుంది. అనంతరం వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన తర్వాత.. ఫ్లయింగ్ లైఫ్‌బాయ్ మళ్లీ గాల్లోకి ఎగిరి తన బేస్‌కు తిరిగి వెళ్తుంది.
పైలట్ అవసరం లేదు
ఈ పరికరాన్ని అధికారికంగా ‘AI Intelligent Flying Rescue Robot’ అని పిలుస్తున్నారు. హాంగ్‌జౌలోని పర్యాటక ప్రాంతాల పోలీసులు దీనిని అభివృద్ధి చేసినట్లు సమాచారం. స్వయంచాలక నావిగేషన్ వ్యవస్థతో పనిచేసే ఈ రోబోట్‌కు ప్రత్యేకంగా పైలట్ అవసరం లేదు. ముఖ్యంగా సముద్రం, సరస్సులు, నదులు వంటి బహిరంగ జలాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రెస్క్యూ బోట్లు ఘటనాస్థలికి చేరుకోవడానికి సమయం పట్టే సందర్భాల్లో.. ముందుగా ఈ ఫ్లయింగ్ లైఫ్‌బాయ్‌ను పంపి బాధితుడికి తేలేందుకు సహాయం అందించవచ్చు.
డ్రోన్‌లతోనూ రెస్క్యూ
వాటర్ రెస్క్యూ డ్రిల్‌లో మరికొన్ని ఆధునిక సాంకేతికతలను కూడా చైనా ప్రదర్శించింది. ప్రమాదంలో చిక్కుకున్న వారి దగ్గరకు డ్రోన్ల ద్వారా గాలితో నింపే లైఫ్‌బాయ్‌లను పంపించారు. ఇవి నీటిని తాకగానే వేగంగా గాలితో నిండిపోయి.. బాధితులకు తాత్కాలికంగా తేలేందుకు సహాయపడతాయి. మరో వ్యవస్థలో మానవరహిత బోట్, డ్రోన్‌ను కలిపి ఉపయోగించారు. డ్రోన్ ముందుగా నీటిలో ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తిస్తుంది. ఆ తర్వాత మానవరహిత బోట్ ఎలాంటి ప్రత్యక్ష మానవ నియంత్రణ లేకుండానే వారి వద్దకు చేరుకుంటుంది. రాత్రి వేళల్లో గాలింపు చర్యలకు డ్రోన్ లైటింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది.
‘ప్రాణాలు కాపాడే టెక్నాలజీ’
ఆగస్టు 14న చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ సోషల్ మీడియాలో ఈ AI ఆధారిత పరికరాన్ని ప్రస్తావించారు. “ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీ”గా ఆయన అభివర్ణించారు. ఈ వినూత్న సాంకేతికతకు సోషల్ మీడియాలోనూ మంచి స్పందన లభిస్తోంది. నీట మునిగి ప్రతి ఏడాది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇలాంటి పరికరాలను ఇతర దేశాలు కూడా అభివృద్ధి చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే చైనాలో ప్రదర్శించే వినూత్న సాంకేతికతలు వాస్తవ పరిస్థితుల్లో ఎంతవరకు అందుబాటులోకి వస్తున్నాయనే ప్రశ్నను కొందరు నెటిజన్లు లేవనెత్తారు. డెమో వీడియోలు కనిపించినప్పటికీ.. వాటి వాస్తవ వినియోగంపై స్పష్టమైన సమాచారం ఉండదని వారు వ్యాఖ్యానించారు.
China has made a flying lifebuoy with AI-powered self-navigation that can rescue two 80kg adults. pic.twitter.com/gJclW49tna
— Li Zexin 李泽欣 (@XH_Lee23) August 22, 2026

