NTV Telugu Site icon

Pakistan: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌కి పాకిస్తాన్ ఆయుధాలు..

Pakistan 2

Pakistan 2

Pakistan: పాకిస్తాన్ ఆర్థికంగా అధ్వాన్న స్థితి ఉంది. అప్పులు ఇచ్చే దేశాలు కూడా లేవు. అక్కడ ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేని విధంగా తారాస్థాయికి చేరింది. విద్యుత్, పెట్రోల్, నిత్యావసరాలు ఇలా అన్నింటికి ధరలు పెరిగాయి. ఇదిలా ఉంటే తనను తాను కాపాడుకునేందుకు పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కి పాకిస్తాన్ 364 మిలియన్ల విలువైన ఆయుధాలను విక్రయించినట్లు నివేదికలు వెలువడ్డాయి. మందుగుండు సామాగ్రని సరఫరా చేసేందుకు గతేడాది రెండు ప్రైవేట్ అమెరికా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్. తీవ్ర నగదు కొరతతో ఉన్న పాక్ ఈ ఆయుధాలను సరఫరా చేసినట్లు మీడియా నివదేిక పేర్కొంది.

బ్రిటిష్ సైనిక కార్గో విమానం రావల్పిందిలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూన్ ఖాన్ నుంచి సైప్రస్, అక్రోతిరిలోని బ్రిటిష్ సైనిక స్థావరానికి, అక్కడి నుంచి రోమేనియాకు వెళ్ళింది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేసేందుకు మొత్తం ఐదుసార్లు ఇలా వెళ్లినట్లు బీబీసీ ఉర్దూ సోమవారం నివేదించింది. అయితే పాక్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఉక్రెయిన్‌కి గానీ, దాని పక్క దేశం రొమేనియాకు కానీ ఎలాంటి ఆయుధాలను అందించలేదని చెప్పింది.

Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రుల కిందే హమాస్ నెట్‌వర్క్.. బందీలు కూడా అక్కడే..

అమెరికన్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ డేటా సిస్టమ్ వివరాల ప్రకారం.. 155 ఎంఎం షెల్స్ విక్రయించాడానికి పాకిస్తాన్ సైన్యం గ్లోబల్ మిలిటరీ, నార్త్రోప్ గ్రుమ్మన్ అనే 2 అమెరికన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీబీసీ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ కి ఆయుధాలు అందించడానికి ఆగస్టు 17, 2022న సంతకాలు జరిగినట్లు తెలిపింది.

ఇస్లామాబాద్ లోని పాక్ విదేశాంగ కార్యాలయం ఉక్రెయిన్ కి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని విక్రయించిన వార్తల్ని ఖండించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాక్ ‘తటస్థ’ విధానాన్ని కొనసాగిస్తోందని, తాము ఎవరికి ఆయుధాలు విక్రయించలేదని వెల్లడించింది. గతేడాది ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్‌ని దించేసిన తర్వాత ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభ రోజుల్లో రష్యా పర్యటనకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు.

ఈ ఏడాది జూలై నెలలో పాకిస్తాన్, ఉక్రెయిన్‌కి ఆయుధాలు తరలించినట్లు వచ్చిన వార్తల్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కుబేలా ఖండించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పాక్ ఆయుధ ఎగుమతులు 3000 శాతం పెరిగాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ డేటా వెల్లడించినట్లు బీబీసీ ఉర్దూ తన నివేదికలో పేర్కొంది. 2021-22లో పాక్ 13 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేస్తే.. 2022-23లో 415 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నివేదికలను పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ నిరాధార, కల్పితమని తిరస్కరించారు.

Show comments