Florida Plane Crash: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం భారీ అగ్నిగోళంలా పేలిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవెన్ ప్రాంతంలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌కు ఈ ప్రమాద స్థలం సుమారు 9 మైళ్లు (14 కిలోమీటర్లు) దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లిన లియర్‌జెట్ 60
తొమ్మిది మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న లియర్‌జెట్ 60 విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నివాస ప్రాంతం వైపు వేగంగా దూసుకెళ్లి రద్దీగా ఉండే రహదారి సమీపంలో కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రహదారిపై పెద్ద గుంత ఏర్పడగా, చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కప్పుకుపోయింది.
ప్రయాణంలో వాతావరణ సమస్యలు
ప్రమాదానికి ముందు విమానం సుమారు 35,000 అడుగుల ఎత్తులో తూర్పు దిశగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో పైలట్లు తీవ్ర గాలివాన, మంచు పేరుకుపోవడం, వర్షపాతం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. దీంతో విమానాన్ని మరో 2,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అయితే కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వివరాల ప్రకారం, ఈ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్‌కు వెళ్తోంది.
అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ఈ ప్రమాదంపై స్పందిస్తూ, ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. లియర్‌జెట్ 60లో ప్రయాణిస్తున్న మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తునకు FAA సహకరిస్తుందని వెల్లడించారు. ఈ విమానం ఒక ప్రైవేట్ విమానం అని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతినిధి జిమ్ రేనాల్డ్స్ తెలిపారు. విమానంలో ప్రయాణించిన వారి వివరాలను వెంటనే వెల్లడించలేమని పేర్కొన్నారు. ఈ విమానం టెయిల్ నంబర్ N722BD అని తెలిపారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తులకు గాయాలు లేదా మరణాలు సంభవించినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
కారు ప్రయాణికుల కెమెరాల్లో భయానక దృశ్యాలు
సమీపంలో కార్లలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు ఈ ప్రమాదాన్ని వీడియోలో రికార్డు చేశారు. బహామాస్‌కు వెళ్తున్న విమానం ఆకాశం నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి రహదారి సమీపంలో కూలిపోవడం వీడియోల్లో కనిపించింది. విమానం కూలిన వెంటనే భారీ పేలుడు, మంటలు చెలరేగాయి. రహదారిపై ఏర్పడిన భారీ గుంత చుట్టూ మంటలు కనిపించగా, దట్టమైన నల్లటి పొగ ప్రమాద స్థలాన్ని పూర్తిగా కమ్మేసింది. విమానం సమీపంలోని ఇళ్లకు కేవలం కొన్ని అడుగుల దూరంలో కూలడంతో స్థానికులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. సమీపంలోని ఇళ్లకు నష్టం జరిగిందా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘోర విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు, పరిస్థితులపై అధికారులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
The private jet that went down just miles from Mar-a-Lago had 9 people on board, according to the FAA.
The plane crashed in a residential area near Cresthaven, Florida.
The aircraft had departed from Austin-Bergstrom International Airport in Texas and was on its way to North Eleuthera Airport in the Bahamas when it crashed.
According to the New York Post, the plane took a “sharp right turn” before nosediving into the ground from about 8,000 feet.
The plane is a $2 million Learjet 60, according to the Post.
Witnesses on the ground say the crash sounded like a missile.
— Collin Rugg (@CollinRugg) November 1, 2026

