Brussels Sees Riots After Morocco Beat Belgium at World Cup: క్రీడల్లో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కానీ, కొందరు అభిమానులు మాత్రం వీటిని సీరియస్‌గా తీసుకుంటుంటారు. తమ అభిమాన జట్టు తప్పకుండా గెలవాల్సిందేనని పట్టుబడతారు. ఒకవేళ గెలవకపోతే మాత్రం రచ్చ చేస్తారు. టీవీలు ధ్వంసం చేయడం, ఆందోళనలకు దిగడం లాంటివి చేపడతారు. ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అలాంటిదే చోటు చేసుకుంది. బెల్జియంపై మొరాకో జట్టు నమోదు చేసిన సంచలన విజయాన్ని జీర్ణించుకోలేక.. అభిమానులు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. నానా రాద్ధాంతం చేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా.. ఖతర్‌లోని అల్ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం మొరాకో, బ్రెజిల్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను మొరాకో మట్టికరిపించి, సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో మొరాకో జట్టు గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన బ్రెజిల్ అభిమానులు.. రాజధాని బ్రసెల్స్‌లో మొరాకో జెండాలు పట్టుకొని, రోడ్లపైకి వచ్చి రచ్చ చేశారు. కర్రలతో దాడి చేస్తూ, వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు సైతం నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఒకరిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు.. పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్ మెటీరియల్, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని.. బాణా సంచా పేల్చడం వల్ల ఓ జర్నలిస్టు ముఖానికి తీవ్ర గాయమైందని తెలిపారు.