Boxing Day tsunami: సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఇండోనేషియా సముద్రంలో సంభవించిన భూకంపం యావత్ ప్రపంచాన్ని భయపెట్టింది. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. అప్పటి వరకు ‘‘సునామీ’’ అంటే ఏమిటో తెలియని ప్రజలకు, అది ఎంత ఘోరంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది. ఇండోనేషియా సుమత్రా ద్వీపంలోని హిందూ మహాసముద్రగర్భంలో భారీ భూకంపం, రాకాసి అలల రూపంలో ఎగిసిపడింది. ఇండోనేషియా, భారత్, శ్రీలంకలతో సహా 14 దేశాల్లో 2,27,000 మంది ప్రాణాలను బలిగొంది.
సునామీకి కారణాలు ఏంటి.?
‘‘బాక్సింగ్ డే’’ సునామీగా పిలిచే ఈ ఘోరకలికి భూమి లోపల పొరల్లో ఉన్న ‘‘టెక్టానిక్ ప్లేట్స్’’ కదలిక కారణం. దశాబ్ధాలుగా టెక్టానిక్ ప్లేట్ల ఫాల్ట్ లైన్ల వెంట పేరుకుపోయిన ఒత్తిడి ఒక్కసారిగా భారీ విధ్వంసం రూపంలో బయటకు వచ్చింది. 2004, డిసెంబర్ 26న స్థానిక సమయం ప్రకారం ఉదయం 7.59 గంటలకు 9.1-9.3 మాగ్నిట్యూడ్‌తో శక్తివంతమైన భూకంపం వచ్చింది. ఇది సుందా మెగాథ్రస్ట్ ఫాల్ట్‌లో 1300 కి.మీ విస్తీర్ణంలో భూభాగం చీలింది. ఇంత పెద్ద విస్తీర్ణంలో భూభాగం రప్చర్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ శక్తి భూకంపం రూపంలో బయటకు వచ్చింది. ఈ ప్రదేశంలోనే ఇండియన్ ప్లేట్, బర్మా ప్లేట్ కింద సబ్‌డక్ట్ అవుతుంది.
సముద్ర అడుగుభాగం ఒక్కసారిగా అనేక మీటర్లు పైకి లేచి, 30 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని స్థానభ్రంశం చేసింది, 30 మీటర్లు (100 అడుగుల) ఎత్తు వరకు అలల్ని సృష్టించింది. ఇవి గంటకు 800 కి.మీ వేగంతో సముద్రంలో అన్ని వైపులా ప్రయాణించాయి. ఈ శక్తి ఏకంగా 23,000 హిరోషిమా అణు బాంబులతో సమానం.
లక్షల్లో మరణాలు:
భూకంప కేంద్రం సుమత్రాలోని ఆషే ప్రావిన్స్‌కు పశ్చిమాన 150 కి.మీ. దూరంలో, సముద్రగర్భం నుండి 30 కి.మీ. దిగువన ఉంది. నిమిషాల్లోనే భారీ అలలు అషేని ఢీకొట్టాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే 1,67,000 మందికి పైగా మరణాలు సంభవించాయి. గంటల వ్యవధిలో అలలు శ్రీలంక, భారత్ తీరాలను చేశాయి. శ్రీలంకలో 35,000 మంది, భారత్‌లో 10,749 మంది, థాయిలాండ్‌లో 8000 మంది మరణించారు.
ఇండోనేషియా బండా అషేలో 51 మీటర్ల అల నగరాన్ని తుడిచిపెట్టింది. ఆ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే సునామీ అలర్ట్ వ్యవస్థ ఉంది. హిందూ మహాసముద్రంలో ఆనాడు ఈ వ్యవస్థ లేదు. ఈ ప్రకృతి విపత్తు తర్వాత, సునామీ వ్యవస్థలు హిందూ మహాసముద్రంలో కూడా ఏర్పాటు చేశారు.
