NTV Telugu Site icon

Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..

Benhamin Netanyahu

Benhamin Netanyahu

Benjamin Netanyahu: ‘‘ఆడు మగడ్రా బుజ్జీ’’ తెలుగు సినిమాలోని ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు ఆ డైలాగ్ ఫర్‌ఫెక్ట్‌గా సూటయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అని చెప్పవచ్చు. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలీలు చంపబడటం, 251 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లిన తర్వాత నెతన్యాహూపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను అధిగమించిన యుద్ధం కొనసాగిస్తున్నాడు.

ఏడాది కాలంగా ఇటు గాజాలోని హమాస్, అటు లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పాటు వీటన్నింటికి పెద్దన్న ఇరాన్‌తో మల్టీఫ్రంట్ వార్ నిర్వహిస్తోంది ఇజ్రాయిల్. ఇలాంటి తరుణంలో దేశంలోని ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి ప్రధాని ఎంతో మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.  నెతన్యాహూ ఇంటాబయట నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ మరీ ఉగ్రవాద సంస్థల్ని దెబ్బతీస్తున్నాడు.

ఏడాది కాలంగా ఇజ్రాయిల్ హమాస్‌తో యుద్ధంలో ఉంది. ఈ యుద్ధంలో దాదాపుగా 42 వేల కన్నా ఎక్కువ మంది ప్రజలు మరణించారు. దీంతో ఐక్యరాజ్యసమితితో పాటు అరబ్ దేశాలు, వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలంటూ ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చినా నెతన్యాహూ వెనకడుగు వేయలేదు. అమెరికా కూడా యుద్ధాన్ని ఆపాలని కొన్ని సందర్భాల్లో కోరినప్పటికీ.. హమాస్‌ని కూకటివేళ్లతో పెకలించే దాకా యుద్ధాన్ని ఆపేదే లేదని స్పష్టం చేశాడు. ఓ వైపు ఇజ్రాయిల్ బందీలు ఇంకా హమాస్ చెరలో ఉన్నప్పటికీ, వెనకడుగు వేయకుండా తన బలగాలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చిన తీరు ఆయనలో తెగువను తెలియజేస్తుంది.

ఒక్కొక్కరిగా ఉగ్రవాదులు ఖతం..

సిన్వార్:
ఏనాడైతే హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసిందో తన మరణాన్ని చేజేతులా కొని తెచ్చుకుంది. మరోవైపు హమాస్‌కి మద్దతు ఇచ్చిన హిజ్బుల్లా కూడా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గురువారం హతమార్చాయి. దశాబ్ధ కాలంగా ఇజ్రాయిల్‌కి దొరక్కుండా గాజాలో ఉంటున్న సిన్వార్‌ని వెతికి వేటాడి చంపేశారు. అక్టోబర్ 07 నాటి దాడులకు ఇతనే ప్రధాన సూత్రధారి.

ఇస్మాయిల్ హనియే:
హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనీయేని ఇరాన్ గడ్డపై ఉండగానే హత్య చేయబడ్డాడు. అయితే, ఈ హత్యను తామే చేశామని ఇజ్రాయిల్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇది ఇజ్రాయిల్ మోసాద్ పనే అని ఇరాన్, దాని ప్రాక్సీలైన హమాస్, హిజ్బుల్లా ఆరోపించాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన సమయంలో, అత్యంత భద్రత కలిగిన హోటల్ గదిలో బాంబు పేలి మరణించాడు. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయం కూడా ఇప్పటికీ ఇరాన్‌కి అంతుబట్టడం లేదు.

హసన్ నస్రల్లా:
ఇజ్రాయిల్‌ కంటిలో నలుసుగా మారిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని కూడా హతమార్చింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఒక బంకర్ కింద ఉన్నాడనే విషయం తెలుసుకున్న ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ కేవలం గంటలోనే ఆపరేషన్ ముగించింది. బంకర్ బస్టర్ బాంబుల్ని వాడి నస్రల్లాను హతం చేసింది. ఇప్పటికీ ఇతడి అంత్యక్రియల్ని బహిరంగంగా చేయలేదంటే ఇజ్రాయిల్ అంటే హిజ్బుల్లాకు ఎంత భయమో అర్థమవుతోంది. ఒక వేళ అంత్యక్రియలు చేస్తే హిజ్బుల్లా నేతలు ఇజ్రాయిల్ రాడార్ కిందకు వస్తారనే భయం వారిని వెన్నాడుతోంది.

హషీమ్ సఫీద్దీన్:
నస్రల్లా తరువాత హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యలు చేపట్టిన హషీమ్ సఫీద్దీన్‌ని కూడా ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్‌లో చంపేసింది. నస్రల్లా మరణించిన రోజుల వ్యవధిలోనే ఇతడిని హతమార్చింది.

ఒక్కొక్కరుగా హమాస్, హిజ్బుల్లా లీడర్లు ఖతం..

హమాస్, హిజ్బుల్లా కమాండర్లను ఒక్కొక్కరిగా ఇజ్రాయిల్ ఖతం చేస్తోంది. హమాస్ కీలక కమాండర్ మహ్మద్ డెయిఫ్‌ని హతం చేసింది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా కన్నా ముందే ఆ గ్రూపులో కీలకమైన నాసర్ ఫోర్స్, రద్వాన్ ఫోర్స్, సదరన్ కమాండర్ల వంటి కీలక కమాండర్లను ఎలిమినేట్ చేసింది.

హిజ్బుల్లా రాకెట్ ఫోర్స్ కీలక కమాండర్ ఫువాద్ షుక్ర్‌ని ఒక్క ఫోన్ కాల్‌లో తన ఇంట్లోకి రప్పించి, మిస్సైల్‌తో దాడి చేసి చంపింది. ఆ తర్వాత ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారిని చంపేసింది. ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే నాయకత్వం లేక హిజ్బుల్లా చావుదెబ్బతింది.

ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి..?

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించిన తర్వాత ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రతీకార దాడి చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయిల్, ఇరాన్ అణు, చమురు క్షేత్రాలపై విరుచుకుపడుతుందని అంతా అనుకున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి దాడి చేయలేదు. కొన్ని వర్గాల ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ముందే దాడి జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Show comments