బ్రిటిష్ అడ్వెంచరర్, ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత బేర్ గ్రిల్స్ మరోసారి ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో మోడీ ఒకరు అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియంతో పాటు ప్రధాని మోడీతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్న బేర్ గ్రిల్స్.. నిజమైన గొప్ప నాయకులు ఎప్పుడూ గట్టిగా మాట్లాడేవారు కాదని వ్యాఖ్యానించారు. బేర్ గ్రిల్స్ తన పోస్ట్‌లో.. ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో కొందరిని కలిశాను. కానీ నిజంగా గొప్ప నాయకులు ఎప్పుడూ పెద్దగా హడావుడి చేయరు.’’ అని రాశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
‘‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’’లో మోడీతో సాహసయాత్ర
2019లో ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రత్యేక ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ, బేర్ గ్రిల్స్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడవుల్లో ట్రెక్కింగ్ చేయడం, భారీ వర్షంలో ప్రయాణించడం, గడ్డి, వెదురు సహాయంతో తాత్కాలిక తెప్ప తయారు చేయడం వంటి సాహస కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అవసరంపై ఇద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యువకుడిగా హిమాలయాల్లో గడిపిన రోజులు తన జీవితాన్ని పూర్తిగా మార్చాయని, ప్రకృతితో తనకు ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరిచాయని చెప్పారు. మనిషి ప్రకృతిని శత్రువుగా కాకుండా మిత్రుడిగా భావించాలని.. మనిషి ప్రకృతికి సహకరిస్తే.. ప్రకృతి కూడా మనిషికి సహకరిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
ఇక అడవిలో ప్రయాణించే సమయంలో పులుల నుంచి రక్షణ కోసం బేర్ గ్రిల్స్ ఒక తాత్కాలిక ఈటె తయారు చేశారు. అయితే దానిని ఆయుధంగా ఉపయోగించేందుకు ప్రధాని మోడీ నిరాకరించారు. ‘‘నా పెంపకం ఏ ప్రాణినైనా చంపడానికి అనుమతించదు. కానీ మీరు పట్టుకోమంటున్నారు కాబట్టి దీన్ని చేతిలో ఉంచుకుంటాను.’’ అంటూ మోడీ చెప్పిన మాటలు అప్పట్లో ట్రెండింగ్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి కూడా ప్రస్తావించారు. వ్యక్తిగత పరిశుభ్రత భారతీయ సంస్కృతిలో భాగమని.. అదే విధంగా సమాజ పరిశుభ్రతపై కూడా ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కార్యక్రమం ప్రసారమైన తర్వాత.. బేర్ గ్రిల్స్‌కు హిందీ రాకపోయినా మోడీతో ఎలా మాట్లాడారనే సందేహం పలువురిలో వ్యక్తమైంది. దీనిపై తర్వాత ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్పందించిన ప్రధాని మోడీ.. షూటింగ్ మొత్తం సమయంలో ఇద్దరూ రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఇయర్‌పీస్ టెక్నాలజీని ఉపయోగించినట్లు వెల్లడించారు.
గతంలోనూ మోడీపై ప్రశంసలు
‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం తర్వాత కూడా బేర్ గ్రిల్స్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీని ప్రశంసించారు. ఆయనను ‘‘గొప్ప క్రీడాస్ఫూర్తి కలిగిన వ్యక్తి’’, ‘‘అసాధారణ ప్రపంచ నాయకుడు’’ అంటూ అభివర్ణించారు. తాజాగా చేసిన ఎక్స్ పోస్టుతో మరోసారి మోడీపై తన అభిమానం వ్యక్తం చేశారు.
I've met some of the most powerful leaders in the world. The best ones were never the loudest. pic.twitter.com/fwufgdTUHs
— Bear Grylls OBE (@BearGrylls) July 13, 2026

